LOADING...
US tests doomsday missile: పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ.. మినిట్‌మ్యాన్-3 అణు క్షిపణిని పరీక్షించిన అమెరికా
మినిట్‌మ్యాన్-3 అణు క్షిపణిని పరీక్షించిన అమెరికా

US tests doomsday missile: పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ.. మినిట్‌మ్యాన్-3 అణు క్షిపణిని పరీక్షించిన అమెరికా

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 05, 2026
12:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఖండాంతర అణు క్షిపణుల్లో ఒకటైన మినిట్‌మ్యాన్-3ను అమెరికా తాజాగా పరీక్షించింది. ఈ ప్రయోగం మంగళవారం (మార్చి 3) నిర్వహించగా,దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. కాలిఫోర్నియా తీరంలో ఉన్న వాండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో మినిట్‌మ్యాన్-3 బాలిస్టిక్ క్షిపణిని అమెరికా ఎయిర్ ఫోర్స్ గ్లోబల్ స్ట్రైక్ కమాండ్ ప్రయోగించింది. ఆయుధాలు అమర్చని ఈ ఖండాంతర క్షిపణి మార్షల్ ఐల్యాండ్స్ ప్రాంతంలో ముందుగా నిర్ణయించిన లక్ష్యాన్ని విజయవంతంగా తాకినట్లు యూఎస్ స్పేస్ ఫోర్స్ వెల్లడించింది. పరీక్ష పూర్తిగా విజయవంతమైందని,క్షిపణి అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని చేరిందని అధికారులు తెలిపారు.

వివరాలు 

మార్క్-21 రీఎంట్రీ వెహికల్

క్షిపణిలోని ప్రతి భాగం ఎలా పనిచేస్తుందో స్పష్టంగా అర్థం చేసుకునేందుకు ఈ పరీక్ష నిర్వహించినట్లు యూఎస్ స్పేస్ ఫోర్స్ పేర్కొంది. అయితే, ఇదే సమయంలో ఇరాన్‌పై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఈ పరీక్ష జరగడం అంతర్జాతీయంగా చర్చకు దారి తీసింది. మినిట్‌మ్యాన్-3 క్షిపణిలో అత్యంత శక్తివంతమైన మార్క్-21 రీఎంట్రీ వెహికల్ అమర్చబడుతుంది. దీనిలో అణు పేలోడ్‌ను కూడా అమర్చే సామర్థ్యం ఉంది.

వివరాలు 

ప్రయోగించిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం

జపాన్‌లోని హిరోషిమాపై పడవేసిన అణుబాంబుతో పోలిస్తే సుమారు 20 రెట్లు ఎక్కువ శక్తి గల అణు వార్‌హెడ్‌లను ఇది మోసుకెళ్లగలదు. గతంలో కూడా ఈ క్షిపణి సామర్థ్యాలను అమెరికా అనేకసార్లు పరీక్షించింది. ఈ ఖండాంతర క్షిపణి గంటకు సుమారు 15 వేల మైళ్ల వేగంతో ప్రయాణిస్తూ దాదాపు 6 వేల మైళ్ల దూరం వరకు దూసుకెళ్లగలదు. ప్రయోగించిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం దీనికి ఉంది. చివరిసారిగా గత ఏడాది నవంబర్‌లో అమెరికా మినిట్‌మ్యాన్-3 క్షిపణిని పరీక్షించింది.

Advertisement