USA-IRAN: ఇరాన్‌కు సహాయం చేసే నౌకలపై అమెరికా కఠిన నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ పరిస్థితులు త్వరలో ముగుస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకవైపు వ్యాఖ్యానిస్తుండగా, మరోవైపు ఇరాన్‌పై ఒత్తిడి మరింత పెంచుతామని ఆయన ప్రభుత్వ యంత్రాంగం స్పష్టం చేయడం ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితిని పెంచుతోంది. ఇరాన్‌కు సంబంధించిన నౌకలపై కఠిన చర్యలు తీసుకుంటామని అమెరికా సైనిక ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. హర్మూజ్ సముద్ర మార్గం దిగ్బంధనం ప్రారంభానికి ముందే బయల్దేరిన ఇరాన్‌కు సంబంధించిన నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని సంయుక్త సైన్యాధిపతుల కమిటీ అధ్యక్షుడు జనరల్ డాన్ కైన్ తెలిపారు. ఇరాన్ జెండాతో ప్రయాణించే నౌకలు లేదా ఆ దేశానికి సహాయం అందించే ప్రయత్నం చేసే నౌకలను కూడా గుర్తించి అడ్డుకుంటామని ఆయన పేర్కొన్నారు.
వివరాలు
హర్మూజ్ సముద్ర మార్గంలో ఇరాన్ ఓడరేవులను అడ్డుకోవడం ద్వారా అమెరికా ఒత్తిడి
ముఖ్యంగా ఆయుధాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, లోహాలు వంటి సరుకులను తరలించే నౌకలను తనిఖీ చేసి అవసరమైతే స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమెరికా,ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ అమలులో ఉంది. అయితే అది త్వరలో ముగియనున్న నేపథ్యంలో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇరాన్ ఓడరేవుల నుంచి ప్రయాణించే నౌకలను హర్మూజ్ సముద్ర మార్గంలో అడ్డుకోవడం ద్వారా అమెరికా ఒత్తిడి పెంచుతోంది. ఈ సమయంలో రెండో దఫా చర్చలకు ఏర్పాట్లు జరుగుతుండగా, తాజా హెచ్చరికలు టెహ్రాన్‌పై మరింత ఒత్తిడిని సృష్టించే అవకాశముంది.
వివరాలు
ఇరువర్గాలు శాంతిని పాటించాలి: పర్వతనేని హరీశ్
ఇదిలా ఉండగా,హర్మూజ్ సముద్ర మార్గంలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం సరైనది కాదని భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ ఇరువర్గాలు శాంతిని పాటించాలని పిలుపునిచ్చారు. సముద్ర మార్గాల్లో భద్రతను పునరుద్ధరించడం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. భారత్ ఇంధన అవసరాలు,ఆర్థిక ప్రయోజనాలకు సముద్ర భద్రత ఎంతో ముఖ్యమని హరీశ్ తెలిపారు. ఈ ఘర్షణల ప్రభావం భారతీయులపై పడుతోందని, నౌకల్లో పనిచేస్తున్న నావికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఆందోళనకరమని గుర్తుచేశారు. అంతర్జాతీయ నిబంధనలను అందరూ గౌరవించాలని, సమస్యలను చర్చలు,దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. అలాగే ప్రతి దేశం సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాల్సిన అవసరాన్ని భారత్ మరోసారి స్పష్టం చేసింది.