LOADING...
Travel Ban: ట్రంప్ సంచలన నిర్ణయం.. 30కు మించి దేశాలపై అమెరికా ట్రావెల్ బ్యాన్ యోచన
ట్రంప్ సంచలన నిర్ణయం.. 30కు మించి దేశాలపై అమెరికా ట్రావెల్ బ్యాన్ యోచన

Travel Ban: ట్రంప్ సంచలన నిర్ణయం.. 30కు మించి దేశాలపై అమెరికా ట్రావెల్ బ్యాన్ యోచన

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 05, 2025
03:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా ట్రావెల్ బ్యాన్ పరిధిని మరింత విస్తరించే యోచనలో ఉందని యూఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ కార్యదర్శి క్రిస్టీ నోమ్ తెలిపారు. ప్రస్తుతం 30కి పైగా దేశాలను ఈ నిషేధ జాబితాలో చేర్చేలా ప్రణాళిక తయారవుతోందని, అయితే ఖచ్చితంగా ఎన్ని దేశాలో వివరాలు వెల్లడించబోమని ఆమె పేర్కొన్నారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యవేక్షణలో వివిధ దేశాల పరిస్థితులను పరిశీలించి ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పటికే గత జూన్‌లో 12 దేశాల పౌరులు అమెరికాలోకి ప్రవేశించకుండా పూర్తిస్థాయి నిషేధం విధించగా, మరో 7 దేశాల నుంచి వచ్చే వారికి పరిమితులు పెట్టారు. ఉగ్రవాద ముప్పు, భద్రతా సమస్యల నేపథ్యంలో ఈ చర్యలు అవసరమని ట్రంప్ అప్పట్లో పేర్కొన్నారు.

వివరాలు 

36 దేశాల పౌరులపై కూడా నిషేధం

పర్యాటకులు,విద్యార్థులు,బిజినెస్ ట్రావెలర్లు సహా వలసదారులు అందరికీ ఈ నిషేధాలు వర్తిస్తాయని నోమ్ తెలిపారు. ఏ దేశాలను కొత్తగా జాబితాలో చేర్చనున్నారో స్పష్టత ఇవ్వలేదు. స్థిరమైన ప్రభుత్వం లేని దేశాలు, తమ పౌరుల వివరాలు సరిగా ఇచ్చి పరిశీలనకు సహకరించలేని దేశాల నుంచి ప్రజలను అమెరికాకు అనుమతించాల్సిన అవసరం లేదని ఆమె వ్యాఖ్యానించారు. గతంలో ట్రంప్ ప్రభుత్వం మరో 36 దేశాల పౌరులపై కూడా నిషేధం విధించడాన్ని పరిశీలిస్తోందని స్టేట్ డిపార్ట్‌మెంట్ అంతర్గత పత్రాల ఆధారంగా వార్తలు వచ్చాయి. ఇటీవల వాషింగ్టన్ డీసీలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు నేషనల్ గార్డ్ సిబ్బంది మృతి చెందడంతో వలస విధానాలను మరింత కఠినతరం చేస్తూ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

వివరాలు 

అమెరికాకు వచ్చిన అఫ్గాన్ పౌరుడు 

ఆ ఘటనకు కారణమైన వ్యక్తి 2021లో పునరావాస కార్యక్రమం ద్వారా అమెరికాకు వచ్చిన అఫ్గాన్ పౌరుడని అధికారులు తెలిపారు. అప్పట్లో సరైన తనిఖీలు జరగలేదని ట్రంప్ వర్గాలు పేర్కొన్నాయి. అనంతరం 'తృతీయ ప్రపంచ దేశాల' నుంచి వలసలను పూర్తిగా నిలిపేస్తామని ట్రంప్ ప్రకటించినప్పటికీ, ఏ దేశాలన్నది స్పష్టంగా చెప్పలేదు. అలాగే, గత జో బైడెన్ పాలనలో మంజూరైన ఆశ్రయ దరఖాస్తులు, 19 దేశాల పౌరులకు ఇచ్చిన గ్రీన్ కార్డులపై తిరిగి సమీక్ష చేపట్టాలని ట్రంప్ ఆదేశించినట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ అధికారులు తెలిపారు.

Advertisement

వివరాలు 

చట్టబద్ధ వలస విధానాల్లో మార్పులపైనా మరింత దృష్టి

ఈ ఏడాది జనవరి నుంచి మళ్లీ అధికారంలోకి వచ్చిన ట్రంప్ ప్రభుత్వం వలస నియంత్రణను అత్యంత ప్రాధాన్యంగా తీసుకొని, పెద్ద నగరాల్లో ఫెడరల్ ఏజెంట్లను మోహరించడం, యూఎస్-మెక్సికో సరిహద్దులో ఆశ్రయం కోరేవారిని వెనక్కి పంపించడం వంటి చర్యలు చేపడుతోంది. అక్రమ వలసలపై కఠిన చర్యలను ప్రచారం చేస్తూ వస్తున్న ప్రభుత్వం, చట్టబద్ధ వలస విధానాల్లో మార్పులపైనా ఇప్పుడు మరింత దృష్టి పెట్టినట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement