US vetoes: గాజాలో కాల్పుల విరమణకు 'వీటో' అధికారంతో అమెరికా అడ్డుకట్ట
ఈ వార్తాకథనం ఏంటి
గాజాలో తక్షణ మానవతావాద కాల్పుల విరమణను డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అనేక దేశాలు మద్దతు ఇచ్చాయి.
అయితే యూఎన్ పెట్టిన తీర్మానాన్ని అమెరికా తన వీటో పవర్ ద్వారా అడ్డుకుంది. ఈ ప్రతిపాదనకు 13 దేశాలు అంగీకరించగా, బ్రిటన్ ఓటింగ్‌కు దూరంగా ఉండగా, అమెరికా వీటో చేసింది.
దీంతో యూఏఈ ప్రవేశ పెట్టిన తీర్మానం వీగిపోయింది. పాలస్తీనా మద్దతుదారులు దీన్ని భయంకరమైన రోజుగా అభివర్ణించారు.
గాజాలో కాల్పుల విరమణ కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.
అమెరికా, ఇజ్రాయెల్ మాత్రమే గాజాలో కాల్పుల విరమణను వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే కాల్పుల విరమణ హమాస్‌కు మాత్రమే ప్రయోజనం చేకూరుస్తుందని ఆ దేశాలు నమ్ముతున్నాయి.
వీటో
అమెరికా చర్యను ఖండించిన హమాస్
ఇజ్రాయెల్ - హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ప్రారంభమై రెండు నెలలకు పైగా అయ్యింది. ఇప్పట్లో యుద్ధం ఆగే సూచనలు కనిపించడం లేదు.
నవంబర్ చివరిలో కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఏడురోజుల పాటు ఒక ఒప్పందం కుదిరింది.
డిసెంబర్ 1న కాల్పుల విరమణ ముగిసిన వెంటనే.. ఇజ్రాయెల్ మరోసారి గాజా స్ట్రిప్‌పై బాంబుల వర్షం కురిపించింది.
ఈ క్రమంలో గాజాలో మానవతావాద కాల్పుల విరమణ కోసం యూఏఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.
గాజాలో కాల్పుల విరమణ ప్రతిపాదనను వీటో చేసిన అమెరికాపై హమాస్ తీవ్రంగా స్పందించింది.
అమెరికా చర్యను అనైతిక, అమానవీయ చర్యగా హమాస్ అభివర్ణించింది. తీర్మానాన్ని అడ్డుకోవడం వల్ల ఇజ్రాయెల్ చేస్తున్న విధ్వంసంలో అమెరికా ప్రమేయం ఉన్నట్టు హమాస్ పేర్కొంది.