US: ఫ్లోరిడా షోలో ఊహించని ప్రమాదం.. పరస్పరం ఢీకొన్న డ్రోన్లు..
క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఫ్లోరిడాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఊహించని ప్రమాదం జరిగింది. ఈ వేడుకలలో భాగంగా ఇయోలా సరస్సుపై నిర్వహించిన ఏరియల్ లైట్ షోలో డ్రోన్ల ప్రదర్శన చేపట్టారు. భారీ సంఖ్యలో ప్రజలు ఈ ప్రదర్శనను తిలకించేందుకు తరలివచ్చారు. అయితే ప్రదర్శన జరుగుతున్న సమయంలో, గాల్లో ఎగురుతున్న వందల కొద్దీ డ్రోన్లు పరస్పరం ఢీకొని కూలిపోయాయి. డ్రోన్ల నుండి విడిపోయిన భాగాలు వేగంగా వచ్చి ప్రేక్షకులపై పడటం వల్ల ఏడేళ్ల బాలుడితో పాటు పలువురు గాయపడ్డారు. గాయపడిన బాలుడి పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు స్థానిక వార్తా సంస్థలు వెల్లడించాయి.
ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు దర్యాప్తు
ఈ ఘటనను ఓ నెటిజన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'ఎక్స్'లో షేర్ చేయగా, అది వైరల్‌గా మారింది. డ్రోన్ల ప్రదర్శనను ఓర్లాండో సిటీ భాగస్వామ్యంతో స్కై ఎలిమెంట్స్ సంస్థ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) అనుమతి ఇచ్చినప్పటికీ, ఈ ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.