LOADING...
US-Iran: 20 ఏళ్లు కావాలన్న అమెరికా.. 5 ఏళ్లు చాలన్న ఇరాన్‌: అణు చర్చలలో బ్రేక్‌ పడిందిక్కడే..!
అణు చర్చలలో బ్రేక్‌ పడిందిక్కడే..!

US-Iran: 20 ఏళ్లు కావాలన్న అమెరికా.. 5 ఏళ్లు చాలన్న ఇరాన్‌: అణు చర్చలలో బ్రేక్‌ పడిందిక్కడే..!

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 14, 2026
11:10 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇరాన్‌ మధ్య శాంతి చర్చలు విఫలమవడంతో పశ్చిమ ఆసియాలో ఉద్రిక్త పరిస్థితులు మళ్లీ ఉధృతమయ్యాయి. పాకిస్థాన్‌ను వేదికగా చేసుకుని జరిగిన ఈ కీలక చర్చలు చివరి దశకు చేరుకున్నట్లే కనిపించినప్పటికీ, చివరి నిమిషంలో వీటికి బ్రేక్‌ పడింది. ప్రధానంగా అణు కార్యకలాపాల విషయంలో ఇరుదేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడమే దీనికి కారణంగా వెల్లడైంది. యురేనియం శుద్ధిని 20 సంవత్సరాల పాటు నిలిపివేయాలని అమెరికా ప్రతిపాదించగా, ఇరాన్‌ అంగీకరించలేదని సమాచారం. ఈ విషయాన్ని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ అమెరికా మీడియా వెల్లడించింది. యురేనియం శుద్ధిని గరిష్ఠంగా ఐదేళ్లపాటు మాత్రమే నిలిపివేయగలమని టెహ్రాన్‌ స్పష్టం చేసినట్లు తెలిపింది. దీనికి అమెరికా సమ్మతించకపోవడంతో చర్చలు నిలిచిపోయినట్లు పేర్కొంది.

వివరాలు 

సమావేశంలో కట్టుదిట్టమైన నియమాలు

మొదటగా యురేనియం శుద్ధిని పూర్తిగా నిలిపివేయాలని అమెరికా పట్టుబట్టగా, చర్చల సమయంలో ఆ డిమాండ్‌ను 20 సంవత్సరాలకు పరిమితం చేయడం గమనార్హం. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత అమెరికా-ఇరాన్‌ మధ్య ఈ స్థాయి అత్యున్నత సమావేశం జరగడం ఇదే మొదటిసారి. ఇస్లామాబాద్‌లోని ఓ విలాసవంతమైన హోటల్‌లో జరిగిన ఈ సమావేశంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, ఇరాన్‌ పార్లమెంట్ స్పీకర్‌ ఘలీబఫ్‌తో పాటు ఇరుదేశాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశం జరిగిన గదిలోకి ఎవరూ ఫోన్లు తీసుకెళ్లడానికి అనుమతి ఇవ్వలేదు. మధ్యలో విరామ సమయంలో బయటకు వచ్చి సందేశాలను పరిశీలించినట్లు పాకిస్థాన్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

వివరాలు 

80 శాతం అంశాలపై ఏకాభిప్రాయం

దాదాపు 20 గంటలపాటు కొనసాగిన ఈ చర్చలు ఒక దశలో ఉద్రిక్తతకు దారి తీసినట్లు సమాచారం. గది బయటకు గట్టిగా మాట్లాడిన శబ్దాలు వినిపించాయని వర్గాలు పేర్కొన్నాయి. సుమారు 80 శాతం అంశాలపై ఏకాభిప్రాయం కుదిరినప్పటికీ, తుదిదశలో చర్చలు విఫలమయ్యాయి. అయితే, ఈ చర్చలు పూర్తిగా నిలిచిపోలేదని తెలుస్తోంది. రెండో దశ ముఖాముఖి సమావేశానికి ఇరుదేశాలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరాన్‌ సానుకూలంగా ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూడా సూచనప్రాయంగా వెల్లడించినట్లు తెలుస్తోంది.

Advertisement