Loading...
Trump: చమురు నౌకలపై హూతీల దాడి.. ఇరాన్‌కు ట్రంప్‌ స్ట్రాంగ్ వార్నింగ్
చమురు నౌకలపై హూతీల దాడి.. ఇరాన్‌కు ట్రంప్‌ స్ట్రాంగ్ వార్నింగ్

Trump: చమురు నౌకలపై హూతీల దాడి.. ఇరాన్‌కు ట్రంప్‌ స్ట్రాంగ్ వార్నింగ్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 24, 2026
08:30 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతున్న వేళ, ఎర్ర సముద్రంలో చోటుచేసుకున్న తాజా పరిణామాలు ఆందోళనను మరింత పెంచాయి. ఇరాన్‌కు మద్దతుగా భావిస్తున్న హూతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్న సౌదీ అరేబియాకు చెందిన రెండు చమురు నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. హూతీలు ఇలాంటి దాడులను కొనసాగిస్తే టెహ్రాన్‌ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. అవసరమైతే అమెరికా సైనిక చర్యకు కూడా వెనుకాడదని హెచ్చరించారు.

వివరాలు 

రెండు సౌదీ అరేబియా చమురు నౌకలపై కాల్పులు

ట్రంప్‌ మాట్లాడుతూ, వాణిజ్య నౌకలపై దాడులు జరిపినందుకు ఏడాది క్రితం అమెరికా హూతీలకు గట్టి సమాధానం ఇచ్చిందని గుర్తు చేశారు.

ఆ తర్వాత కొంతకాలం వారు నియంత్రణలోనే ఉన్నప్పటికీ, ఇప్పుడు మళ్లీ దాడులకు దిగారని పేర్కొన్నారు.

తాజాగా రెండు సౌదీ అరేబియా చమురు నౌకలపై కాల్పులు జరపడం తీవ్ర ఆందోళన కలిగించే అంశమని అన్నారు.

భవిష్యత్తులో కూడా ఇలాంటి ఘటనలు పునరావృతమైతే అందుకు పూర్తి బాధ్యత ఇరాన్‌దేనని ట్రంప్‌ స్పష్టం చేశారు.

హూతీలు ఇరాన్‌కు ప్రతినిధుల్లా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఇదిలా ఉండగా, ఈ నెల 12న అమెరికా బలగాలు ఇరాన్‌పై చేపట్టిన దాడులకు ప్రతీకారంగానే చమురు నౌకలను లక్ష్యంగా చేసుకున్నామని హూతీలు ప్రకటించిన విషయం తెలిసిందే.

వివరాలు 

హర్మూజ్‌ జలసంధి భద్రతపై అమెరికా దృష్టి

మరోవైపు, వాణిజ్య నౌకలు, సముద్ర మార్గాల్లో ప్రయాణించే నావికులను బెదిరించే ప్రయత్నాలను ఇరాన్‌ ప్రోత్సహిస్తోందని అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ ఆరోపించింది.

ఈ చర్యలకు అడ్డుకట్ట వేసేందుకే అమెరికా సైనిక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించింది.

హర్మూజ్‌ జలసంధిలో నౌకల రాకపోకలు ఎలాంటి అంతరాయం లేకుండా సజావుగా కొనసాగేలా అమెరికా దళాలు కృషి చేస్తున్నాయని తెలిపింది.

ఆ ప్రాంతంలో భద్రతను పునరుద్ధరించి, హర్మూజ్‌ జలసంధిపై పూర్తి నియంత్రణ సాధిస్తామనే విశ్వాసాన్ని కూడా వ్యక్తం చేసింది.

ADVERTISEMENT