WHO: డబ్ల్యూహెచ్‌ఓకు అమెరికా గుడ్‌బై.. 'కరోనా వైఫల్యాలే కారణం'
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నుంచి తమ దేశం వైదొలిగే ప్రక్రియ పూర్తయిందని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. చైనాలోని వూహాన్‌లో ప్రారంభమైన కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో డబ్ల్యూహెచ్‌ఓ విఫలమైందనే కారణంతోనే ఆ సంస్థ నుంచి తప్పుకున్నట్లు స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి సమయంలో అవసరమైన అత్యవసర చర్యలను డబ్ల్యూహెచ్‌ఓ సకాలంలో చేపట్టలేదని, అంతేకాకుండా కొన్ని దేశాల రాజకీయ ప్రభావాల నుంచి బయటపడి స్వతంత్రంగా పనిచేయలేకపోయిందని అమెరికా ఆరోపించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం అమెరికా ఆరోగ్య శాఖ మంత్రి రాబర్ట్ ఎఫ్. కెనడీ జూనియర్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంయుక్త ప్రకటనను విడుదల చేశారు.
వివరాలు
డబ్ల్యూహెచ్‌ఓ వల్ల ఏర్పడుతున్న అడ్డంకులను అధిగమించేందుకే ఈ నిర్ణయం
డబ్ల్యూహెచ్‌ఓ చర్యలు అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని అమెరికా ప్రభుత్వం వ్యాఖ్యానించింది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే 14155 నంబర్‌తో కార్యనిర్వాహక ఆదేశాన్ని జారీ చేశారని,దాని అమలులో భాగంగానే ఇప్పుడు డబ్ల్యూహెచ్‌ఓ నుంచి వైదొలిగామని వెల్లడించింది. డబ్ల్యూహెచ్‌ఓ వల్ల ఏర్పడుతున్న అడ్డంకులను అధిగమించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. కరోనా మహమ్మారి సమయంలో ఆ సంస్థ సక్రమంగా స్పందించలేదని,వ్యాధి నియంత్రణలో విఫలమైందని విమర్శించింది. దాని ప్రభావాన్ని అమెరికా ప్రజలు తీవ్రంగా అనుభవించారని తెలిపింది. చాలా అంతర్జాతీయ సంస్థల మాదిరిగానే డబ్ల్యూహెచ్‌ఓ కూడా తన హామీలను నిలబెట్టుకోలేదని, ప్రాథమిక లక్ష్యాల నుంచి దారి తప్పిందని ఆరోపించింది. అమెరికా జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పదేపదే చర్యలు చేపట్టిందని పేర్కొంది.
వివరాలు
డబ్ల్యూహెచ్‌ఓ వ్యవస్థాపక దేశాల్లో అమెరికా ఒకటి
కరోనా గురించి అమెరికాకు సకాలంలో సరైన సమాచారం అందించి ఉంటే ఎంతోమంది అమెరికన్ల ప్రాణాలు కాపాడగలిగేవాళ్లమని అమెరికా ప్రభుత్వం అభిప్రాయపడింది. డబ్ల్యూహెచ్‌ఓ అమెరికాకు శత్రుత్వం ఉన్న దేశాల ప్రభావానికి లోనై పనిచేసిందని మరోసారి అమెరికా ఆరోపించింది. డబ్ల్యూహెచ్‌ఓ వ్యవస్థాపక దేశాల్లో అమెరికా ఒకటని, ఏటా భారీగా నిధులు అందించే దేశం కూడా తమదేనని గుర్తు చేసింది. అయినప్పటికీ అమెరికాకు వ్యతిరేకంగా, శత్రుదేశాలకు అనుకూలంగా డబ్ల్యూహెచ్‌ఓ నిర్ణయాలు తీసుకుందని తెలిపింది. ఆయా దేశాల రాజకీయ ఒత్తిడులకు లోబడి వ్యవహరించిందని ఆరోపించింది. అమెరికా ఇచ్చిన సహకారాన్ని ఆ సంస్థ మర్చిపోయిందని విమర్శించింది. తన వైఫల్యాలను 'ప్రజారోగ్య ప్రయోజనాలు' అనే పేరుతో కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసిందని వ్యాఖ్యానించింది.
వివరాలు
అమెరికా ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యానే డబ్ల్యూహెచ్‌ఓ నుంచి వైదొలిగాం: అమెరికా
అంతేకాదు, స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉన్న డబ్ల్యూహెచ్‌ఓ ప్రధాన కార్యాలయం ఎదుట ఎగురవేసే అమెరికా జెండాను తొలగించేందుకు కూడా ఆ సంస్థ నిరాకరించిందని పేర్కొంది. అమెరికా నిష్క్రమణకు ఇంకా అధికారిక ఆమోదం ఇవ్వలేదని డబ్ల్యూహెచ్‌ఓ వాదిస్తోందని, అమెరికా పరిహారం చెల్లించాల్సి ఉందన్న ప్రచారం చేస్తోందని తెలిపింది. ఎన్నేళ్లుగా ఇలాంటి అవమానాలను అమెరికా భరించిందని,ఇకపై అలా జరగదని స్పష్టం చేసింది. అమెరికా ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యానే డబ్ల్యూహెచ్‌ఓ నుంచి వైదొలిగామని అమెరికా ప్రభుత్వం వెల్లడించింది. డబ్ల్యూహెచ్‌ఓ సిబ్బంది నిర్వహణకు, వివిధ కార్యక్రమాల కోసం నిధుల కేటాయింపును పూర్తిగా నిలిపివేశామని తెలిపింది. ప్రజారోగ్య రంగంలో ప్రపంచ నాయకత్వాన్ని అమెరికానే చేపడుతుందని పేర్కొంది. సాంక్రమిక వ్యాధులు అమెరికా గడ్డపైకి రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.
వివరాలు
డబ్ల్యూహెచ్‌ఓ నిర్వహణ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది
ఈ లక్ష్యంతో ప్రత్యక్షంగా, ద్వైపాక్షికంగా, పరస్పర ప్రయోజనాల ఆధారంగా భాగస్వామ్యాలను ఏర్పాటు చేస్తామని తెలిపింది. ప్రపంచ దేశాలతో పాటు విశ్వసనీయమైన కొన్ని ఆరోగ్య సంస్థలతో సహకారం కొనసాగిస్తామని వెల్లడించింది. డబ్ల్యూహెచ్‌ఓ నిర్వహణ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని, అంతర్జాతీయ రాజకీయాలు, పలు దేశాల ప్రయోజనాల మధ్య చిక్కుకుని సరిదిద్దుకోలేని స్థితికి చేరిందని విమర్శించింది. కరోనా కాలంలో డబ్ల్యూహెచ్‌ఓ వైఫల్యం కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఎంతోమంది అమెరికన్ల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. డబ్ల్యూహెచ్‌ఓకు అత్యధికంగా నిధులు అందించే దేశాల జాబితాలో అమెరికా తొలి స్థానంలో ఉందని అధికారులు గుర్తు చేశారు.
వివరాలు
అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటన
అమెరికా అందించే నిధుల్లో పెద్ద భాగం బిల్ గేట్స్ ఫౌండేషన్, గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యునైజేషన్ (జీఏవీఐ), ది వ్యాక్సిన్ అలయన్స్ ద్వారా వస్తుందని తెలిపారు. ఈ అన్ని సంస్థల్లోనూ బిల్ గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక భాగస్వామిగా ఉందని పేర్కొన్నారు. 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డబ్ల్యూహెచ్‌ఓకు సుమారు రూ.1191 కోట్ల నిధులు అందిస్తామని అప్పటి జో బైడెన్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని చెప్పారు. అయితే ఆ మొత్తాన్ని విడుదల చేయకుండానే అమెరికా డబ్ల్యూహెచ్‌ఓ నుంచి వైదొలిగిందని వెల్లడించారు. అమెరికా నిష్క్రమణ నేపథ్యంలో ఈ అంశాన్ని డబ్ల్యూహెచ్‌ఓ అధికారులు ప్రస్తావించినట్లు సమాచారం. ఇదే విషయాన్ని అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో కూడా పేర్కొంది.