USS Abraham Lincoln: యుద్ధనౌకలో కలకలం.. సముద్రంలోకి దూకి.. అమెరికా నావికుల ఆత్మహత్యాయత్నం..!
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభానికి కారణమవుతున్నాయి. అదే సమయంలో యుద్ధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. గల్ఫ్ జలాల్లో నెలల తరబడి యుద్ధనౌకలపై విధులు నిర్వహిస్తున్న అమెరికా నావికులు మానసికంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు సమాచారం. సుదీర్ఘకాలం సముద్రంలోనే ఉండటం, ఆహారం, మంచినీటి కొరత, అపరిశుభ్రమైన మరుగుదొడ్లు వంటి సమస్యలు సిబ్బందిని మరింత కుంగదీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో యూఎస్‌ఎస్ అబ్రహాం లింకన్ యుద్ధనౌకలో పనిచేస్తున్న కొందరు అమెరికా నావికులు సముద్రంలోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు 'మిలిటరీ టైమ్స్' కథనం పేర్కొంది.
వివరాలు
250 రోజులుగా సముద్రంలోనే..
ఇరాన్‌తో యుద్ధం ప్రారంభం కాకముందే అమెరికా పలు యుద్ధనౌకలను పశ్చిమాసియా జలాల్లో మోహరించింది.
వాటిలో యూఎస్‌ఎస్ అబ్రహాం లింకన్ కూడా ఒకటి. ఈ నౌకలో దాదాపు 5 వేల మంది నావికులు, మెరైన్లు విధులు నిర్వహిస్తున్నారు.
రికార్డు స్థాయిలో సుమారు 250 రోజులుగా ఈ యుద్ధనౌక సముద్రంలోనే కొనసాగుతోంది.
ఇంత సుదీర్ఘకాలం ఇంటికి దూరంగా, కఠినమైన పరిస్థితుల్లో విధులు నిర్వహించడం సిబ్బందిపై తీవ్ర మానసిక ప్రభావాన్ని చూపుతున్నట్లు గతంలోనూ కథనాలు వెలువడ్డాయి.
దీనికి తోడు అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ముందుకు సాగకపోవడంతో యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే దానిపై స్పష్టత లేకుండా పోయింది.
ఈ అనిశ్చితి కూడా నావికులపై అదనపు ఒత్తిడిని పెంచుతున్నట్లు విశ్లేషణలు చెబుతున్నాయి.
వివరాలు
ఆరుగురు నావికులు ఆత్మహత్యాయత్నం
మరోవైపు అబ్రహాం లింకన్‌తో పాటు ఇతర యుద్ధనౌకలను ఉపయోగిస్తూ ఇరాన్ ఓడరేవులపై అమెరికా మరోసారి దిగ్బంధం విధించినట్లు సమాచారం.
దీంతో ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న నావికుల మానసిక పరిస్థితి మరింత దిగజారినట్లు తెలుస్తోంది.
తమ కుటుంబ సభ్యులను తిరిగి ఎప్పుడు కలుసుకుంటామో తెలియని పరిస్థితి కూడా వారిలో ఆందోళనకు కారణమై ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మొత్తం ఆరుగురు అమెరికా నావికులు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు సమాచారం.
అయితే ఈ వాదనలను అమెరికా నేవీ అధికారులు ఖండించారు. నావికుల ఆత్మహత్యాయత్నాలకు సంబంధించిన కథనాలను వారు తోసిపుచ్చారు.
వివరాలు
ట్రంప్ ఉన్నంతకాలం యుద్ధం కొనసాగుతుందా?
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలో ఉన్నంతకాలం ఇరాన్‌తో యుద్ధం కొనసాగుతుందా అనే చర్చ కూడా మొదలైంది.
ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)నుంచి వచ్చిన హెచ్చరికలు ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి.
అమెరికాతో యుద్ధాన్ని ఉద్దేశపూర్వకంగా సుదీర్ఘకాలం కొనసాగించే అవకాశం ఉందని ఐఆర్‌జీసీకి చెందిన ఓ సీనియర్ సలహాదారు వ్యాఖ్యానించినట్లు సమాచారం.
యుద్ధాన్ని పొడిగించడం ద్వారా ప్రత్యర్థిని బలహీనపర్చవచ్చని, తద్వారా ఇరాన్‌పై దాడి చేయాలనుకునే వారు కూడా తమ నిర్ణయంపై పునరాలోచించే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు.
దీంతో ఒకవైపు పశ్చిమాసియా ఘర్షణలు అంతర్జాతీయంగా ఇంధన, భద్రతా ఆందోళనలను పెంచుతుండగా.. మరోవైపు యుద్ధరంగంలో ఉన్న సైనికులపై మానసిక ఒత్తిడి కూడా తీవ్ర స్థాయికి చేరుతున్నట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి.