Middle East Tensions: మిడిల్‌ఈస్ట్‌లో ఉద్రిక్తతలు.. అబ్రహం లింకన్ స్థానంలో జార్జ్ వాషింగ్టన్ నౌక
ఈ వార్తాకథనం ఏంటి
మిడిల్‌ఈస్ట్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా మరో కీలక యుద్ధనౌకను రంగంలోకి దింపేందుకు సిద్ధమవుతోంది. ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో చాలాకాలంగా సముద్రంలో విధులు నిర్వహిస్తున్న అబ్రహం లింకన్ యుద్ధనౌక స్థానంలో యూఎస్‌ఎస్ జార్జ్ వాషింగ్టన్‌ను మోహరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే అబ్రహం లింకన్ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకోలేదని.. ఇది ముందస్తు ప్రణాళికలో భాగమేనని అమెరికా అధికారులు స్పష్టం చేశారు. ఎన్నో రోజులుగా అరేబియా సముద్రంలో మోహరించిన అబ్రహం లింకన్ నౌకలో దాదాపు 5,000 మంది నావికులు, మెరైన్లు విధులు నిర్వర్తిస్తున్నారు. గత నవంబర్ 21న శాన్ డియాగో నుంచి పసిఫిక్ ప్రాంతానికి బయలుదేరిన ఈ యుద్ధనౌక.. ఫిబ్రవరి 28న ఇరాన్‌తో యుద్ధం ప్రారంభమైన తర్వాత మధ్యప్రాచ్యానికి మళ్లింది.
వివరాలు
తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్న నావికులు
అప్పటి నుంచి ఎలాంటి పోర్ట్ కాల్ లేకుండానే వరుసగా 200 రోజులకు పైగా సముద్రంలోనే ఉండాల్సి వచ్చింది.
మొత్తం ప్రయాణం 250 రోజులకు పైగా కొనసాగడంతో సిబ్బంది తీవ్ర అలసట, మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు సమాచారం.
నావికులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారన్న ఆరోపణలు కూడా ఆందోళనకు దారితీశాయి.
కొందరిలో ఆత్మహత్య ఆలోచనలు వచ్చినట్లు, మరికొందరు ఓడ నుంచి దూకేందుకు ప్రయత్నించినట్లు వార్తలు వెలువడ్డాయి.
దీంతో నౌకలో పనిచేస్తున్న వారి కుటుంబ సభ్యులు, చట్టసభ సభ్యుల్లో ఆందోళన పెరిగింది.
వివరాలు
సిబ్బందిలో ఆత్మహత్యాయత్నాలు పెరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవు: పీట్ హెగ్‌సేత్
ఇదే సమయంలో నౌకలో ఆహారం కొరత, కలుషితమైన నీరు, మరుగుదొడ్ల సమస్యలు, బూజు పట్టిన పరిస్థితులు, మెయిల్ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం వంటి ఇబ్బందులు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
శాన్ డియాగోలో జరిగిన సమావేశంలో నౌక బాధ్యుల వ్యవహారశైలిపై వారు తీవ్ర అసంతృప్తి, నిరసన వ్యక్తం చేశారు.
అయితే ఈ ఆరోపణలను అమెరికా నావికాదళం రక్షణ కార్యదర్శి పీట్ హెగ్‌సేత్ ఖండించారు. సిబ్బందిలో ఆత్మహత్యాయత్నాలు పెరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు.
నావికులకు కౌన్సెలర్లు, శుద్ధి చేసిన తాగునీరు, భోజనం అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
అయితే యుద్ధ పరిస్థితుల కారణంగా సరఫరా కేంద్రాలు దెబ్బతినడంతో ఆహారం, పరిశుభ్రతకు అవసరమైన వస్తువుల సరఫరాలో కొన్ని అంతరాయాలు ఏర్పడ్డాయని అమెరికా నావికాదళం అంగీకరించింది.
వివరాలు
యూఎస్‌ఎస్ జార్జ్ వాషింగ్టన్
మరోవైపు, ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో స్పష్టత లేకపోవడం కూడా నావికుల మానసిక ఒత్తిడికి ప్రధాన కారణాల్లో ఒకటిగా నిపుణులు చెబుతున్నారు.
యుద్ధం కొనసాగుతున్న కొద్దీ సముద్రంలో సుదీర్ఘకాలం విధులు నిర్వహించాల్సిన పరిస్థితి సిబ్బందిపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో అబ్రహం లింకన్ యుద్ధనౌకకు విధుల నుంచి కొంత విరామం కల్పించేందుకు యూఎస్‌ఎస్ జార్జ్ వాషింగ్టన్‌ను మోహరించనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం వియత్నాంలోని డానాంగ్ నుంచి బయలుదేరిన జార్జ్ వాషింగ్టన్.. సింగపూర్ జలసంధి మీదుగా హిందూ మహాసముద్రం వైపు ప్రయాణిస్తున్నట్లు అమెరికా నావికాదళ అధికారులు వెల్లడించారు.