Loading...
Bangladesh: హసీనా పునరాగమనం వార్తల నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు..  ఒకరు మృతి
హసీనా పునరాగమనం వార్తల నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు.. ఒకరు మృతి

Bangladesh: హసీనా పునరాగమనం వార్తల నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు..  ఒకరు మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 11, 2026
08:32 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పదవీచ్యుత ప్రధాని షేక్‌ హసీనా(79) తిరిగి స్వదేశానికి రానున్నారన్న వార్తల నేపథ్యంలో దేశవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘర్షణల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా,ఎనిమిది వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ విషయాన్ని పోలీసులు మంగళవారం ఉదయం వెల్లడించారు. హసీనా నాయకత్వంలోని నిషేధిత అవామీ లీగ్‌ పార్టీ, దాని అనుబంధ సంస్థల కార్యకర్తలే ఈ ఘటనలకు పాల్పడినట్లు పోలీసులు ఆరోపించారు. ఫరీద్‌పూర్‌లో గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డు పక్కన నిలిపి ఉంచిన బస్సులపై నాటు బాంబులతో దాడి చేశారు. ఈ ఘటనలో పలు బస్సులు దెబ్బతిన్నాయి. దాడి సమయంలో ఓ బస్సులో నిద్రిస్తున్న డ్రైవర్‌ దట్టమైన పొగ కారణంగా ఊపిరాడక ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు.

వివరాలు 

రైలు బోగీకి ఆందోళనకారులు నిప్పు

మరోవైపు షరియత్‌పూర్‌ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఉద్రిక్తత చోటుచేసుకుంది.

అవామీ లీగ్‌, దాని అనుబంధ సంస్థలకు చెందిన వందలాది మంది కార్యకర్తలు పద్మా నది వంతెనపై ఉన్న టోల్‌ప్లాజాను దిగ్బంధించారు.

దీంతో ఆ మార్గంలో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.

ఆందోళనకారులు నాటు బాంబులు విసరడంతోపాటు పలు వాహనాలను ధ్వంసం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

నోట్రోకొనా జిల్లాలోని మోహన్‌గంజ్‌ రైల్వే స్టేషన్‌లో హవోర్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు చెందిన ఓ బోగీకి ఆందోళనకారులు నిప్పుపెట్టారు.

ఈ ఘటనలో రైలు బోగీ కొంతమేర దెబ్బతింది. ఇక షేక్‌ హసీనా స్వగ్రామమైన తుంగిపారాలో అవామీ లీగ్‌, దాని అనుబంధ విద్యార్థి సంఘం కార్యకర్తలు పోలీసులతో ఘర్షణకు దిగారు. ఈ సందర్భంగా పోలీసు వాహనానికి నిప్పంటించారు.

వివరాలు 

హసీనాకు న్యాయపరంగా మరో మార్గం లేదు

బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లేందుకు కొత్త పాస్‌పోర్టు,జాతీయ గుర్తింపు కార్డు జారీ చేయాలని ప్రభుత్వాన్ని షేక్‌ హసీనా కోరినట్లు వచ్చిన వార్తలపై ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ మహ్మద్‌ అమినుల్‌ ఇస్లాం తీవ్రంగా స్పందించారు.

ప్రస్తుతం హసీనాకు మరణశిక్షను అనుభవించడం మినహా న్యాయపరంగా మరో మార్గం లేదని వ్యాఖ్యానించారు.

ఆమెకు కొత్త పాస్‌పోర్టు లేదా ఇతర గుర్తింపు పత్రాలు జారీ చేసే అవకాశం లేదని స్పష్టం చేశారు.

ADVERTISEMENT

వివరాలు 

హసీనాకు న్యాయపరంగా మరో మార్గం లేదు

నిజంగానే హసీనా స్వదేశానికి తిరిగి రావాలనుకుంటే ట్రైబ్యునల్‌లో విచారణ జరుగుతున్న సమయంలోనే వచ్చి ఉండాల్సిందని ఆయన అన్నారు.

లేదంటే శిక్ష విధించిన 30 రోజుల్లోగా తిరిగి రావాల్సి ఉండేదని వ్యాఖ్యానించారు.

విద్యార్థుల నాయకత్వంలో జరిగిన తిరుగుబాటు కారణంగా అవామీ లీగ్‌ ప్రభుత్వం కుప్పకూలినప్పటి నుంచి, అంటే 2024 ఆగస్టు నుంచి షేక్‌ హసీనా భారత్‌లోనే ఉంటున్నారు.

ADVERTISEMENT