LOADING...
Venezuela: 920కి చేరిన భూకంప మృతుల సంఖ్య.. శిథిలాల కింద 50 వేల మంది?
920కి చేరిన భూకంప మృతుల సంఖ్య.. శిథిలాల కింద 50 వేల మంది?

Venezuela: 920కి చేరిన భూకంప మృతుల సంఖ్య.. శిథిలాల కింద 50 వేల మంది?

వ్రాసిన వారు Moogati Shabari
Jun 27, 2026
09:43 am

ఈ వార్తాకథనం ఏంటి

జంట భూకంపాల ప్రభావంతో వెనిజులాలో పరిస్థితులు అత్యంత విషమంగా మారాయి. భారీ సంఖ్యలో భవనాలు కూలిపోవడంతో రాజధాని కారకస్‌తో పాటు లా గువేరా రాష్ట్రం సహా అనేక ప్రాంతాలు శిథిలాలుగా మారాయి. బుధవారం సాయంత్రం సంభవించిన ఈ భూకంపాల కారణంగా ఇప్పటివరకు 920 మంది మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. మరో 3,360 మంది గాయపడగా, సుమారు 50 వేల మంది ఆచూకీ ఇంకా లభించలేదు. వీరిలో చాలామంది శిథిలాల కింద చిక్కుకుని ఉండే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. తమ కుటుంబ సభ్యులు, బంధువుల కోసం ప్రజలు నిరంతరం అన్వేషణ కొనసాగిస్తూ, వారు క్షేమంగా బయటపడాలని ఆశిస్తున్నారు.

వివరాలు

పార్కుల్లోనే గడుపుతున్న ప్రజలు..

సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు ప్రపంచంలోని అనేక దేశాలు తమ ప్రత్యేక బృందాలను వెనిజులాకు పంపించాయి. భారత్ కూడా 'ఆపరేషన్ అమిస్తాద్' పేరుతో రెండు వాయుసేన విమానాల ద్వారా సహాయక సామగ్రితో పాటు వైద్య బృందాన్ని అక్కడికి తరలించింది. జంట భూకంపాల ప్రభావంతో వెనెజువెలా వ్యాప్తంగా సుమారు 67.6 లక్షల మంది ప్రభావితమైనట్లు అంతర్జాతీయ వలసల సంస్థ వెల్లడించింది. రాజధాని కారకస్‌లోనే దాదాపు 20 లక్షల మంది ఈ విపత్తు బారిన పడ్డారు. ఇంకా అనేక మంది శిథిలాల కిందే చిక్కుకుని ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు హెచ్చరిస్తున్నారు.

వివరాలు

50 వేేల మంది పేర్లు నమోదు..

గాయపడిన వారికి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. పలు ప్రాంతాల్లో శిథిలాల కింద మృతదేహాలు చిక్కుకుపోవడం, రక్తపు మడుగుల్లో కనిపించడం వల్ల పరిస్థితి అత్యంత విషాదకరంగా మారింది. తమ ఆత్మీయుల పేర్లు రాసిన ప్లకార్డులు పట్టుకుని వారి ఆచూకీ కోసం ప్రజలు కన్నీరుమున్నీరుగా వెతుకుతున్నారు. వందలాది మంది గురువారం రాత్రి కూడా ఇళ్లకు వెళ్లకుండా పార్కుల్లోనే భయాందోళనల మధ్య గడిపారు. పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రుల రోదనలు హృదయ విదారకంగా మారాయి. దేశవ్యాప్తంగా సుమారు 250 బహుళ అంతస్తుల భవనాలు నేలమట్టమైనట్లు వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ తెలిపారు. గల్లంతైన వారి వివరాల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్‌సైట్‌లో ఇప్పటికే దాదాపు 50 వేల మంది పేర్లు నమోదైనట్లు సమాచారం.

Advertisement

వివరాలు

ప్రపంచ దేశాల నుంచి సహాయహస్తం..

వెనిజులాకు మద్దతుగా అమెరికా 150 మిలియన్ డాలర్ల విలువైన సహాయక సామగ్రిని అందించనున్నట్లు ప్రకటించింది. ఈ సామగ్రి రవాణా కోసం రెండు యుద్ధ నౌకలతో పాటు రవాణా విమానాలు, హెలికాప్టర్లను సిద్ధం చేసింది. స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, మెక్సికో, బ్రెజిల్ తదితర దేశాలు కూడా సహాయక సిబ్బంది, వైద్య బృందాలు, మానవతా సహాయాన్ని అందించేందుకు ముందుకొచ్చాయి. 'ఆపరేషన్ అమిస్తాద్'లో భాగంగా భారత్ సైన్యానికి చెందిన ఫీల్డ్ హాస్పిటల్ యూనిట్‌తో పాటు 35 టన్నులకు పైగా సహాయక సామగ్రి, మందులు, వైద్య పరికరాలను రెండు సి-17 గ్లోబ్‌మాస్టర్ వాయుసేన విమానాల ద్వారా వెనిజులాకు తరలించింది.

Advertisement

వివరాలు

ఫిలిప్పీన్స్‌లోనూ భూకంపం..

దక్షిణ ఫిలిప్పీన్స్‌లో శుక్రవారం సంభవించిన భూకంపం స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేసింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.7గా నమోదైంది. అయితే ఈ ఘటనలో ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం వెలువడలేదు.

Advertisement