LOADING...
Indian Army: భారత సైన్యం సేవలకు ఫిదా అయిన వెనిజులా ప్రజలు.. 'మేమంతా ఒకటే'
భారత సైన్యం సేవలకు ఫిదా అయిన వెనిజులా ప్రజలు.. 'మేమంతా ఒకటే'

Indian Army: భారత సైన్యం సేవలకు ఫిదా అయిన వెనిజులా ప్రజలు.. 'మేమంతా ఒకటే'

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 03, 2026
03:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారీ విధ్వంసం సృష్టించిన వరుస భూకంపాల అనంతరం వెనిజులాలో భారత సైన్యం అందిస్తున్న వైద్య సేవలపై అక్కడి ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. భారత్ చేపట్టిన 'ఆపరేషన్ అమిస్తాద్'లో భాగంగా రాజధాని కారకాస్‌లో ఏర్పాటు చేసిన ఫీల్డ్ ఆస్పత్రిలో భారత సైన్యానికి చెందిన వైద్య బృందం 24 గంటల పాటు నిరంతరంగా చికిత్స అందిస్తోంది. ఈ సేవలు వేలాది మంది భూకంప బాధితులకు ఊరటనిస్తున్నాయి. ఉత్తర వెనిజులాను వణికించిన 7.2, 7.5 తీవ్రతల భూకంపాలు గత శతాబ్దంలో దేశాన్ని తాకిన అత్యంత శక్తివంతమైన భూకంపాలుగా నమోదయ్యాయి. ఈ విపత్తులో ఇప్పటివరకు 1,700 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది గాయపడ్డారు. మరో పదివేల మంది నిరాశ్రయులయ్యారు.

వివరాలు 

'60 ఏళ్లలో ఇలాంటి వైద్య సేవలు చూడలేదు'

భారత విదేశాంగ శాఖ విడుదల చేసిన వీడియోల్లో కారకాస్‌లోని ఇంటర్నేషనల్ లా రింకోనాడా రేస్‌ట్రాక్ వద్ద ఏర్పాటు చేసిన భారత ఫీల్డ్ ఆస్పత్రిలో భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి. చికిత్స పొందిన ఓ వృద్ధురాలు మాట్లాడుతూ, "60 ఏళ్లలో ఇలాంటి వైద్య సేవలు నేను ఎప్పుడూ చూడలేదు. మీకు ఎంతో కృతజ్ఞురాలిని" అని తెలిపింది. చికిత్స అనంతరం తనను ఇంటికి చేర్చేందుకు భారత వైద్య బృందం అంబులెన్స్ ఏర్పాటు చేసిందని ఆమె పేర్కొంది. "ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం లేదని, మనమంతా ఒకే కుటుంబమని, వారు చెప్పారు. అదే నా మనస్సుకు హత్తుకుంది" అని ఆమె భావోద్వేగంతో చెప్పింది.

వివరాలు 

ఉచిత వైద్యం.. ఉచిత మందులు

మరో స్థానికుడు మాట్లాడుతూ, ఉచితంగా చికిత్సతో పాటు మందులు అందించడం తమలాంటి బాధిత కుటుంబాలకు ఎంతో ఉపశమనం కలిగించిందన్నారు. "ఈ మందుల కోసం ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం రాలేదు. మీరు ఏర్పాటు చేసిన ఆస్పత్రి స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగపడుతోంది. మీ దేశానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు" అని పేర్కొన్నారు.

Advertisement

వివరాలు 

భారత ఫీల్డ్ ఆస్పత్రిని సందర్శించిన వెనిజులా మంత్రులు

భారత సహాయక చర్యలకు వెనిజులా ప్రభుత్వం కూడా ప్రశంసలు తెలిపింది. ఆ దేశ విదేశాంగ మంత్రి ఆండ్రియా కోరావో ఫారియా, ఉప ఆరోగ్య మంత్రి భారత ఫీల్డ్ ఆస్పత్రిని సందర్శించి సహాయక చర్యలను పరిశీలించారు. అత్యంత వేగంగా స్పందించి సేవలందిస్తున్న భారత వైద్య బృందానికి వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

వివరాలు 

కారకాస్‌కు 23 గంటల ప్రయాణం

భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ,భూకంప ప్రభావిత ప్రాంతాల్లో భారత సైన్యానికి చెందిన వైద్యులు నిరంతరం సేవలందిస్తూ బాధితులకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. భారత వాయుసేనకు చెందిన రెండు సీ-17 గ్లోబ్‌మాస్టర్ విమానాల ద్వారా న్యూఢిల్లీ నుంచి సుమారు 14 వేల కిలోమీటర్ల దూరంలోని కారకాస్‌కు 23 గంటల ప్రయాణంలో మొత్తం 66 టన్నుల మానవతా సహాయ సామగ్రిని భారత్ తరలించింది. ఈ సహాయంలో పూర్తిస్థాయి సదుపాయాలతో కూడిన భారత సైన్యం ఫీల్డ్ ఆస్పత్రి, 35 టన్నులకుపైగా అత్యవసర మందులు, ఆధునిక వైద్య పరికరాలు, అలాగే ఒక్కోటి 300 మంది అత్యవసర రోగులకు చికిత్స అందించే సామర్థ్యం కలిగిన రెండు భీష్మ్ క్యూబ్స్ (పోర్టబుల్ ఆస్పత్రి యూనిట్లు) ఉన్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఉచిత వైద్యం, మందులతో అండగా నిలిచిన భారత్‌కు వెనిజులా ధన్యవాదాలు

Advertisement