UK: డ్రెస్ కోడ్ ఉల్లంఘన.. మహిళా ఉద్యోగికి రూ.30లక్షల పరిహారం ఆదేశించిన ట్రైబ్యునల్
లండన్‌లోని ఓ కంపెనీకి ఉద్యోగ ట్రైబ్యునల్‌లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. డ్రెస్ కోడ్ పాటించలేదన్న కారణంతో తొలగించిన మహిళా ఉద్యోగి ఎలిజబెత్ బెనాస్సీకి 30 వేల పౌండ్లు (రూ.32,20,818) పరిహారం చెల్లించాల్సిందిగా ట్రైబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. 2022లో ఎలిజబెత్ బెనాస్సీ లండన్‌లోని మ్యాక్సిమస్ యూకే సర్వీసెస్‌లో చేరారు. ఆమె డ్రెస్ కోడ్ గురించి తెలియకపోవడంతో స్పోర్ట్స్ షూ ధరించి వచ్చినందుకు కంపెనీ ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ నిర్ణయాన్ని అన్యాయంగా ఆమె భావించి ఉద్యోగ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు.
ఎలిజబెత్ పక్షాన తీర్పు
బెనాస్సీ వాదనలో, తాను డ్రెస్ కోడ్ గురించి ఎలాంటి సమాచారం పొందలేదని, అదే సమయంలో ఓ మేనేజర్ తనపై అనవసరమైన విమర్శలు చేశారని పేర్కొన్నారు. వాదనలపై విచారణ జరిపిన ట్రైబ్యునల్ ఎలిజబెత్ పక్షాన తీర్పు వెలువరించింది. ఆమె కంపెనీలో కొత్తగా చేరిందని, డ్రెస్ కోడ్ గురించి తెలియకపోవచ్చని పేర్కొన్నారు. అలాంటప్పుడు అవగాహన కల్పించకుండా ఉద్యోగం నుంచి తొలగించడం అన్యాయమని ట్రైబ్యునల్ పేర్కొంది. కంపెనీ తీర్పును స్వీకరించి పరిహారం చెల్లించాల్సి వచ్చింది.