USA-Iran: ఇరాన్‌పై మళ్లీ యుద్ధ మేఘాలు.. దాడులకు అమెరికా సిద్ధమా?
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇరాన్ సంబంధాల్లో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు యూఎస్-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై ఎప్పుడైనా కీలక ప్రకటన రావచ్చని వార్తలు వస్తుండగా, మరోవైపు ఇరాన్‌పై మరోసారి సైనిక దాడులకు అమెరికా సిద్ధమవుతోందనే నివేదికలు వెలువడుతున్నాయి. చివరి నిమిషంలో దౌత్యపరమైన ప్రయత్నాలు విఫలమైతే సైనిక చర్యకు దిగే అంశాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు అమెరికా మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్‌తో పాటు కీలక అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇరాన్‌పై తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం.
వివరాలు
ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు
అధికార వర్గాల ప్రకారం, ఇరాన్‌తో జరుగుతున్న చర్చలు విఫలమైతే వెంటనే సైన్యాన్ని రంగంలోకి దించే అంశంపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే దాడులకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ సమావేశం అనంతరం వైట్‌హౌస్ అధ్యక్షుడి షెడ్యూల్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నట్లు సమాచారం. మెమోరియల్ డే సందర్భంగా న్యూజెర్సీకి వెళ్లాలని ట్రంప్ తొలుత భావించినప్పటికీ, ఆ పర్యటనను రద్దు చేసుకుని వైట్‌హౌస్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా అమెరికాకు చెందిన పలువురు సైనిక, నిఘా అధికారులు కూడా తమ ప్రణాళికలను రద్దు చేసుకున్నట్లు తెలిసింది.
వివరాలు
పెళ్లికి కూడా హాజరు కాలేదు
ఇరాన్‌పై అమెరికా దాడులకు సిద్ధమవుతోందనే వార్తల మధ్య ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. తన కుమారుడు జూనియర్ డొనాల్డ్ ట్రంప్ వివాహానికి తాను హాజరుకావడం లేదని వెల్లడించారు. ట్రంప్ జూనియర్, బెట్టినా ఆండర్సన్‌ల వివాహానికి వెళ్లాలని తనకు ఎంతో ఆసక్తి ఉందని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వ పరిస్థితుల దృష్ట్యా తాను అక్కడికి వెళ్లలేకపోతున్నానని తెలిపారు. ఈ కీలక సమయంలో వైట్‌హౌస్‌లోనే ఉండటం అత్యంత ముఖ్యమని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.