US-IRAN WAR: ఇరాన్‌పై మరోసారి యుద్ధ మేఘాలు.. భారీ దాడికి సిద్ధమైన అమెరికా, ఇజ్రాయిల్
ఈ వార్తాకథనం ఏంటి
యూఎస్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే వారం ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి భారీ దాడికి సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే దాడికి సంబంధించిన కీలక లక్ష్యాలను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని పలు నివేదికలు ధ్రువీకరించాయి. శాంతి చర్చలు నిలిచిపోవడంతో ''ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ''ని మళ్లీ తీవ్రతరం చేసేందుకు అమెరికా సిద్ధమైందని తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన ముగిసిన అనంతరం ఈ వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఇరాన్‌కు చెందిన కీలక లక్ష్యాల జాబితాను అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్తంగా రూపొందించినట్లు సమాచారం.
వివరాలు
అత్యవసర సమావేశాలు
దీనిపై ఇజ్రాయెల్ రక్షణ దళాలతో పాటు యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) అత్యవసర సమావేశాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. వచ్చే వారం నాటికి దాడిని ప్రారంభించేందుకు వేగంగా సన్నాహాలు కొనసాగుతున్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి. గతంలో ఏప్రిల్ 8న కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ, రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదరలేదని సమాచారం. ఈ నేపథ్యంలోనే మరోసారి భారీ దాడి చేపట్టాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
అమెరికాపై ఇజ్రాయిల్ ఒత్తిడి
మరోవైపు, యుద్ధాన్ని తిరిగి ప్రారంభించాలని అమెరికాపై ఇజ్రాయిల్ ఒత్తిడి తెస్తున్నట్లు అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి. ఇరాన్‌లో ఇంకా మిగిలి ఉన్న అణు కర్మాగారాలు, క్షిపణి వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేయాలనే లక్ష్యంతో ఇజ్రాయిల్ ముందుకెళ్తోందని సమాచారం. అదే సమయంలో అమెరికాలో జరగనున్న మధ్యంతర ఎన్నికల ముందు ఈ యుద్ధంలో విజయం సాధించామని ప్రజలకు చెప్పాలనే ఆలోచనలో ట్రంప్ ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మరోసారి పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం కనిపిస్తోంది.