Iran: భారత్‌కు రావాల్సిన మందుల విమానంపై దాడి.. ఇది యుద్ధ చర్యే అన్న ఇరాన్
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్ నుంచి భారత్‌కు రావాల్సిన పౌర విమానం మీద దాడి జరిగిందన్న వార్త అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. మానవతా సాయాన్ని తీసుకువస్తున్న ఈ విమానాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికానే దాడి జరిపిందని భారత్‌లోని ఇరాన్ ఎంబసీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ ఘటనను యుద్ధ చర్యగా అభివర్ణిస్తూ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్‌కు పలు దేశాల నుంచి మందులు, వైద్య పరికరాలు తరలిస్తున్న పౌర విమానం మషద్ విమానాశ్రయంలో దిగిన సమయంలో అమెరికా-ఇజ్రాయెల్ కలిసి దాడి చేశాయని ఎంబసీ పేర్కొంది. ఈ దాడిలో విమానం దెబ్బతిన్నట్లు వెల్లడించింది. దీనిపై ఇరాన్ పౌర విమానయాన శాఖ కూడా తీవ్రంగా ఖండించింది.
వివరాలు
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఇరాన్
మానవతా సహాయాన్ని అందించే పౌర విమానాలను లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని ఎంబసీ స్పష్టం చేసింది. ఇది యుద్ధ చర్యగా పరిగణించాల్సిన ఘటన అని పేర్కొంది. ఈ ఘటనపై తక్షణ విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సంస్థలను కోరింది. ఇరాన్‌లో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అక్కడి ప్రజలకు సహాయం అందించేందుకు భారత్ మానవతా సాయం పంపుతున్న విషయం తెలిసిందే.
వివరాలు
మషద్ విమానాశ్రయంలో దాడి
ఈ క్రమంలో మహాన్ ఎయిర్‌కు చెందిన విమానం మందులు, వైద్య సామగ్రి తీసుకువచ్చేందుకు ఈ వారం భారత్‌కు రావాల్సి ఉంది. అయితే, అది మషద్ విమానాశ్రయంలో ఉన్న సమయంలోనే ఈ దాడి జరిగినట్లు సమాచారం. తాజా పరిణామాలతో ఇరాన్‌కు చేరాల్సిన సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, ఈ ఘటనపై అమెరికా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.