Donald Trump: గాజాను స్వాధీనం చేసుకుంటాం.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. గాజాను స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నట్లు ప్రకటించారు.
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో భేటీ అనంతరం ఈ ప్రకటన చేశారు.
ఇజ్రాయెల్-గాజా యుద్ధంపై తాజా పరిస్థితుల గురించి ట్రంప్ నెతన్యాహూతో చర్చించారు.
"గాజాను అమెరికా స్వాధీనం చేసుకుంటుంది. అక్కడ ధ్వంసమైన భవనాలను పునరుద్ధరిస్తాం. ఆ ప్రాంతాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేస్తే, అక్కడి ప్రజలకు అపరిమిత ఉద్యోగాలు, ఇళ్లు అందించవచ్చు" అని ట్రంప్ పేర్కొన్నారు.
ట్రంప్ ప్రకటన చరిత్రను మారుస్తుందని నెతన్యాహూ అభిప్రాయపడ్డారు.
వివరాలు
గాజాను అభివృద్ధి చేస్తాం: ట్రంప్
గాజాలో ఉద్రిక్తతల కారణంగా నిరాశ్రయులుగా మారిన పాలస్తీనీయులకు అరబ్ దేశాలు ఆశ్రయం కల్పించాలని ఇటీవల ట్రంప్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.
అయితే, ఈ ప్రతిపాదనను ఈజిప్టు, జోర్డాన్, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, పాలస్తీనా అథారిటీ, అరబ్ లీగ్‌లు సంయుక్తంగా ఖండించాయి.
అలా చేస్తే తమ ప్రాంతంలోని స్థిరత్వం దెబ్బతింటుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే గాజాను స్వాధీనం చేసుకొని అభివృద్ధి చేస్తామని ట్రంప్ ప్రకటించడం గమనార్హం.
వివరాలు
ఖండించిన హమాస్
గాజాను స్వాధీనం చేసుకుంటానంటూ ట్రంప్ చేసిన ప్రకటనను హమాస్ ఖండించింది.
ట్రంప్ గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మిలిటెంట్ సంస్థకు చెందిన ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు.
"ఈ ప్రాంతంలో గందరగోళం, ఉద్రిక్తతలు పెంచడానికే ట్రంప్ ఈ ప్రకటన చేశారు. మా ప్రజలు దీన్ని ఆమోదించరు. తమ భూమి నుంచి వారిని బలవంతంగా తరలించడాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది" అని హమాస్ ప్రతినిధి సమీ అబు జుహ్రీ ఓ ప్రకటనలో తెలిపారు.