Loading...
Trump: మేం కూడా అదే పని చేస్తాం.. చైనా గూఢచర్యంపై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు
మేం కూడా అదే పని చేస్తాం.. చైనా గూఢచర్యంపై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

Trump: మేం కూడా అదే పని చేస్తాం.. చైనా గూఢచర్యంపై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 19, 2026
12:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ (Xi Jinping) త్వరలో సతీసమేతంగా అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) చైనాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా-చైనా మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని పేర్కొన్న ఆయన.. అదే సమయంలో ఇరు దేశాలు పరస్పరం గూఢచర్యం చేసుకుంటాయని అన్నారు. గతంలో అమెరికాకు చెందిన ఓ అధికారి చైనా తమ దేశంపై గూఢచర్యం చేస్తోందని చెప్పిన విషయాన్ని ట్రంప్‌ గుర్తు చేసుకున్నారు. అయితే తాము కూడా చైనా విషయంలో అదే పని చేస్తున్నందున.. ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదని ఆయన తెలిపారు.

వివరాలు

జిన్‌పింగ్‌ అమెరికా పర్యటన..

''జిన్‌పింగ్‌ వచ్చే వారం అమెరికాకు వస్తారు. ఇతర దేశాలతో మాకు సంబంధాలు అంత బాగా లేకపోయినా.. చైనాతో మాత్రం మంచి అనుబంధం ఉంది.

ఆయనతో సమావేశం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఆ చర్చల్లో పలు కీలక ఒప్పందాలు చేసుకోబోతున్నాం. ప్రతి ఒప్పందం వెనక ఒక స్పష్టమైన ఉద్దేశం ఉంటుందని ట్రంప్‌ పేర్కొన్నారు.

ఈ నెలాఖరులో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌.. తన సతీమణి పెంగ్‌ లియువాన్‌తో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు.

వచ్చే వారం వాషింగ్టన్‌కు చేరుకోనున్న జిన్‌పింగ్‌ను ట్రంప్‌ స్వయంగా విమానాశ్రయంలో స్వాగతించనున్నారు.

వాషింగ్టన్‌ డీసీకి సమీపంలోని జాయింట్‌ బేస్‌ ఆండ్రూస్‌ (Joint Base Andrews)కు జిన్‌పింగ్‌ చేరుకున్న సమయంలో ట్రంప్‌ అక్కడే ఉండి స్వాగతం పలకనున్నట్లు అమెరికా అధికారులు వెల్లడించారు.

వివరాలు

అరుదైన ఖనిజాల సరఫరా  చర్చ

విదేశీ నేతలను అమెరికా అధ్యక్షుడు విమానాశ్రయంలో స్వయంగా స్వాగతించడం అరుదైన పరిణామంగా పేర్కొంటున్నారు.

జిన్‌పింగ్‌ పర్యటనలో భాగంగా వైట్‌హౌస్‌లో అధికారిక స్వాగత కార్యక్రమం, సైనిక సమీక్ష, ఇరు దేశాల నేతల మధ్య కీలక చర్చలు, అనంతరం స్టేట్‌ డిన్నర్‌ జరగనున్నాయి. జిన్‌పింగ్‌, పెంగ్‌ లియువాన్‌ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

ఈ పర్యటనలో భాగంగా ప్రముఖ టెక్‌ దిగ్గజాలు ఎలాన్‌ మస్క్‌, సుందర్‌ పిచాయ్‌, టిమ్‌ కుక్‌, మైఖేల్‌ డెల్‌, జెఫ్‌ బెజోస్‌, జెన్సన్‌ హువాంగ్‌, శామ్‌ ఆల్ట్‌మన్‌, జేన్‌ ఫ్రేజర్‌ తదితరులు స్టేట్‌ డిన్నర్‌కు హాజరయ్యే అవకాశం ఉంది.

అమెరికా-చైనా నేతల చర్చల్లో వాణిజ్యం, అరుదైన ఖనిజాల సరఫరా, టెక్నాలజీ, కృత్రిమ మేధ(AI)వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

ADVERTISEMENT