LOADING...
Donald Trump: 'ఎక్కడున్నా వేటాడుతాం'.. అమెరికా దాడుల్లో డ్రగ్స్‌ డాన్‌ హతం
'ఎక్కడున్నా వేటాడుతాం'.. అమెరికా దాడుల్లో డ్రగ్స్‌ డాన్‌ హతం

Donald Trump: 'ఎక్కడున్నా వేటాడుతాం'.. అమెరికా దాడుల్లో డ్రగ్స్‌ డాన్‌ హతం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 13, 2026
10:10 am

ఈ వార్తాకథనం ఏంటి

వెనెజువెలాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మాదకద్రవ్యాల అక్రమ రవాణా నెట్‌వర్క్‌పై అమెరికా కీలక ఆపరేషన్‌ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ట్రెన్‌ డి ఆరాగ్వా గ్యాంగ్‌ నాయకుడు హెక్టర్‌ రస్తెన్‌ఫోర్డ్‌ గురెరో ఫ్లోర్స్‌ హతమైనట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ, 'ట్రెన్‌ డి ఆరాగ్వా ఉగ్రవాదులకు వెనెజువెలాలోనే కాదు.. ఈ భూమ్మీద ఎక్కడా సురక్షిత స్థావరం ఉండదు. హంతకులు, డ్రగ్‌ లార్డ్స్‌ ఎక్కడ దాక్కున్నా వారిని వేటాడతాం. చివరకు నరకానికి పంపిస్తామని హెచ్చరించారు. ఈ వారం ప్రారంభంలో అమెరికా బలగాలు ఈ ఆపరేషన్‌ను నిర్వహించాయి.

వివరాలు

ఆ నేరస్థుడిపై 5 మిలియన్ డాలర్ల బహుమతి

అత్యంత విశ్వసనీయమైన నిఘా సమాచారంతో ట్రెన్‌ డి ఆరాగ్వా ముఠాకు చెందిన ఒక కాంపౌండ్‌ను లక్ష్యంగా చేసుకుని బాంబు దాడులు జరిపాయి. ఈ దాడిలో హెక్టర్‌ గురెరో అక్కడికక్కడే మృతిచెందినట్లు అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ వెల్లడించారు. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోను వైట్‌హౌస్‌ సోషల్‌ మీడియాలో విడుదల చేసింది. అమెరికా ప్రభుత్వం ఇప్పటికే ట్రెన్‌ డి ఆరాగ్వా ముఠాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. గ్యాంగ్‌ నాయకుడు హెక్టర్‌ గురెరో తలపై 5 మిలియన్‌ డాలర్ల బహుమతిని కూడా ప్రకటించింది. అమెరికాలో డ్రగ్స్‌ అక్రమ రవాణా, హింసాత్మక నేరాలు, గ్యాంగ్‌ కార్యకలాపాల వెనుక ఈ ముఠా కీలక పాత్ర పోషిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది.

వివరాలు

ట్రెన్‌ డి ఆరాగ్వా గ్యాంగ్‌ కార్యకలాపాలు మరింత విస్తరించాయి

ట్రెన్‌ డి ఆరాగ్వా గ్యాంగ్‌ దశాబ్దం క్రితం వెనెజువెలాలోని ఆరాగ్వా నగరంలోని ఒక జైలులో ఏర్పడింది. వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్‌ మదురో నియంత్రణలో ఈ ముఠా పనిచేస్తోందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఈ గ్యాంగ్‌ కార్యకలాపాలు మరింత విస్తరించినట్లు అమెరికా పేర్కొంది. జైళ్లను తమ కార్యకలాపాల కేంద్రాలుగా మార్చుకుని, అక్కడి నుంచే దోపిడీలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఇతర నేరాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. అత్యంత క్రూరత్వంతో వ్యవహరించే ఈ ముఠాను స్థానికంగా 'రక్తపిపాసి'గా పిలుస్తారని అమెరికా అధికారులు తెలిపారు.

Advertisement