Iran war : పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్టు.. 8నెలల పాపతో సహా 206 మంది మృతి!
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం మానవ నష్టాలను పెంచుతోంది. యుద్ధం ప్రారంభమైన తొలి 10 రోజుల్లోనే 260 మంది మరణించారని ఇరాన్ ప్రభుత్వం వెల్లడించింది. వీరిలో 206 మంది మహిళలు, చిన్నారులే ఉన్నారని అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఈ వివరాలను భారతదేశంలోని ఇరాన్ రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో వెల్లడించింది. ఆ పోస్టులో "యుద్ధం తొలి 10 రోజులు - 260 మంది అమరులు. వీరిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలే" అని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారిలో అత్యంత చిన్న వయస్కురాలు కేవలం 8 నెలల పాప.
Details
గాయపడిన వారిలో నాలుగు నెలల శిశువు
అలాగే గాయపడిన వారిలో అత్యంత చిన్న వయస్కురాలు నాలుగు నెలల శిశువు ఉందని తెలిపారు. ఇదిలా ఉండగా మార్చి 8న ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 1,200కు పైగా చేరింది. వీరిలో సుమారు 200 మంది మహిళలు, 12 ఏళ్లలోపు ఉన్న 200 మంది పిల్లలు ఉన్నారని పేర్కొన్నారు. అలాగే 10,000 మందికి పైగా పౌరులు గాయపడ్డారని తెలిపింది.
Details
పొరుగు దేశాల్లో 24 మంది మృతి
మరోవైపు ఇరానియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ మార్చి 3న వెల్లడించిన సమాచారం ప్రకారం అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్‌లో 787 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. ఇక ఇజ్రాయెల్ అధికారుల ప్రకారం ఇజ్రాయెల్ వైపు 14 మంది మరణించగా, యూఎస్ కు చెందిన ఏడుగురు సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. పొరుగు దేశాల్లో కూడా 24 మంది మరణించారు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై భారీ సైనిక దాడులు చేపట్టాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీతో పాటు పలువురు ఉన్నతాధికారులు మరణించినట్లు సమాచారం. అమెరికా ఈ ఆపరేషన్‌కు 'ఎపిక్ ఫ్యూరీ'(Epic Fury)అనే పేరు పెట్టగా, ఇజ్రాయెల్ 'లయన్స్ రోర్' (Lion's Roar)గా పిలిచింది.
Details
అమెరికా సైనిక స్థావరాలపై దాడులు
వాషింగ్టన్-తెహ్రాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో, అలాగే ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలు కొనసాగుతున్న సమయంలో ఈ దాడులు చోటుచేసుకున్నాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్, అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసింది. బహ్రెయిన్, కువైట్, యూఏఈ, ఇరాక్, ఖతార్, సౌదీ అరేబియా, జోర్డాన్, అజర్‌బైజాన్ వంటి ప్రాంతాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలు లక్ష్యంగా దాడులు జరిగాయి. అయితే పశ్చిమాసియా యుద్ధానికి సంబంధించి వివిధ వర్గాల నుంచి వస్తున్న సమాచారం, సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఫోటోలు, వీడియోలు వంటి వాటి నిజానిజాలను స్వతంత్రంగా ధృవీకరించడం కష్టమని అంతర్జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయి. ఈయుద్ధానికి సంబంధించిన వివరాలు తరచుగా మారుతున్న నేపథ్యంలో అధికారిక సమాచారం ఆధారంగానే నివేదికలు వెలువడుతున్నాయి.