Saudi East-West Pipeline: హర్మూజ్ తర్వాత.. సౌదీ పైప్‌లైన్ మూసివేత.. భారత్‌పై ప్రభావమెంత?
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇరాన్-అమెరికా మధ్య దాడులు కొంతమేర తగ్గినట్లు కనిపిస్తున్న సమయంలోనే.. సౌదీ అరేబియా, హూతీ తిరుగుబాటుదారుల మధ్య పోరు తీవ్రరూపం దాల్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో సౌదీ చమురు ఎగుమతులకు కీలకమైన ఈస్ట్-వెస్ట్ ఆయిల్ పైప్‌లైన్ (పెట్రోలైన్)ను మూసివేయాల్సి వచ్చింది. హర్మూజ్ జలసంధికి ప్రత్యామ్నాయ మార్గంగా సౌదీ ఈ పైప్‌లైన్‌ను ఏర్పాటు చేసుకుంది.
వివరాలు
అబ్‌కైక్ నుంచి యాన్బు వరకు.. 1,200 కి.మీ. పైప్‌లైన్
సౌదీ అరేబియాలోని తూర్పు ప్రాంతంలో ఉన్న అబ్‌కైక్ చమురు శుద్ధిక్షేత్రం నుంచి పశ్చిమాన ఎర్రసముద్ర తీరంలోని యాన్బు పోర్టు వరకు ఈస్ట్-వెస్ట్ ఆయిల్ పైప్‌లైన్ విస్తరించి ఉంది.
దీని పొడవు సుమారు 1,200 కిలోమీటర్లు. యాన్బు పోర్టు నుంచి బాబ్ ఎల్ మాండెబ్, సూయజ్ కెనాల్ మీదుగా ఆసియా, ఐరోపా దేశాలకు చమురు రవాణా అవుతుంది.
హర్మూజ్ జలసంధిలో ఏదైనా అంతరాయం ఏర్పడినా.. చమురు ఎగుమతులు నిలిచిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యామ్నాయ మార్గాన్ని నిర్మించారు.
అయితే ఇప్పుడు హూతీల దాడుల నేపథ్యంలో ఈ పైప్‌లైన్ కార్యకలాపాలను నిలిపివేయాల్సి వచ్చింది.
ఇరాక్ వైపు నుంచి వచ్చిన డ్రోన్‌ల సమూహం తమ పైప్‌లైన్‌పై దాడి చేసిందని సౌదీ అరేబియా విదేశాంగ శాఖ వెల్లడించింది.
వివరాలు
అబ్‌కైక్ నుంచి యాన్బు వరకు.. 1,200 కి.మీ. పైప్‌లైన్
పైప్‌లైన్ వెంబడి ఉన్న పంపింగ్ స్టేషన్ల వద్ద మంటలు చెలరేగినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ఇందుకు సంబంధించి అమెరికా అధికారుల వ్యాఖ్యలు, ఉపగ్రహ చిత్రాలను ఆయా కథనాలు ప్రస్తావించాయి.
అయితే పైప్‌లైన్ మళ్లీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే దానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు.
వివరాలు
రోజుకు 70 లక్షల బ్యారెళ్ల రవాణా సామర్థ్యం
సౌదీ ఈస్ట్-వెస్ట్ ఆయిల్ పైప్‌లైన్‌కు రోజుకు 70 లక్షల బ్యారెళ్ల చమురును రవాణా చేసే సామర్థ్యం ఉంది.
ఇందులో 50 లక్షల బ్యారెళ్ల ముడిచమురును ఎగుమతుల కోసం కేటాయిస్తారు. మిగిలిన చమురును సౌదీలోని రిఫైనరీలకు తరలిస్తారు.
అయితే గత కొన్ని నెలలుగా ఈ పైప్‌లైన్ పూర్తి సామర్థ్యంతో పనిచేయడం లేదు.
రోజుకు సుమారు 40 లక్షల నుంచి 50 లక్షల బ్యారెళ్ల చమురునే రవాణా చేస్తోంది.
అయినప్పటికీ.. ఈ పరిమాణం ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 4 నుంచి 5 శాతానికి సమానం కావడం గమనార్హం.
ఇప్పుడు ఈ ప్రత్యామ్నాయ మార్గంపైనా దాడులు జరగడంతో అంతర్జాతీయ చమురు సరఫరా వ్యవస్థలో మరింత అనిశ్చితి నెలకొనే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
వివరాలు
భారత్‌పై ప్రభావం ఎంత?
భారత్ చమురు దిగుమతుల్లో సౌదీ అరేబియాకు కీలక స్థానం ఉంది.
హర్మూజ్ జలసంధి సంక్షోభం తర్వాత సౌదీ నుంచి భారత్‌కు వచ్చే చమురు పరిమాణం గణనీయంగా తగ్గింది.
అయినప్పటికీ.. దేశ మొత్తం చమురు దిగుమతుల్లో సౌదీ వాటా 7 నుంచి 8శాతం వరకు ఉంది.
ఈ చమురులో గణనీయమైన భాగం యాన్బు పోర్టు నుంచే వస్తోంది. ఆగస్టులో భారత్ రోజుకు సగటున 3,32,000 బ్యారెళ్ల సౌదీ చమురును దిగుమతి చేసుకుంది.
జులైలో ఈ పరిమాణం 4,14,000బ్యారెళ్లుగా ఉంది.ఈ నేపథ్యంలో పెట్రోలైన్ మూసివేత భారత రిఫైనరీలపై కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది.
అయితే భారత్ వివిధ దేశాల నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్నందున.. రిఫైనరీలకు ముడిచమురు కొరత పెద్దగా ఏర్పడకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
వివరాలు
చమురు ధరలు పెరిగితే దిగుమతి బిల్లు మరింత భారం
కానీ ప్రత్యామ్నాయ దేశాల నుంచి చమురు కొనుగోలు చేయాల్సి వస్తే.. అధిక ధరలు చెల్లించాల్సి రావడం భారత్‌కు ప్రధాన సవాలుగా మారవచ్చు.
పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (PPAC)గణాంకాల ప్రకారం.. ఏప్రిల్-జులై కాలంలో భారత్ ముడిచమురు దిగుమతుల బిల్లు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 56శాతానికి పైగా పెరిగి 63.4బిలియన్ డాలర్లకు చేరుకుంది.
అయితే దిగుమతుల పరిమాణం మాత్రం కేవలం 60కోట్ల బ్యారెళ్ల మేరకే పెరిగింది.
అంటే.. దిగుమతి పరిమాణం స్వల్పంగా పెరిగినా, చమురు ధరల పెరుగుదల కారణంగా వ్యయం భారీగా పెరిగింది.
దీంతో దేశ కరెంటు ఖాతా లోటుపై కూడా ఒత్తిడి పెరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు మరింత పెరిగితే.. భారత్ దిగుమతి వ్యయం ఇంకా అధికమయ్యే అవకాశం ఉంది.
వివరాలు
భారత్ ముడిచమురు దిగుమతులపై సుమారు 135 బిలియన్ డాలర్ల ఖర్చు
వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ ముడిచమురు దిగుమతులపై సుమారు 135 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల స్థాయిలో కొనసాగి, దిగుమతి పరిమాణం తగ్గకపోతే.. ఈ ఏడాది చమురు దిగుమతి వ్యయం 200 బిలియన్ డాలర్లను దాటే అవకాశం ఉందని అంచనా.
ఒకవేళ అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు 100 డాలర్ల కంటే చాలా ఎక్కువ స్థాయిలో ఎక్కువకాలం కొనసాగితే.. దిగుమతి బిల్లు పెరగడంతో పాటు ద్రవ్యోల్బణం, వాణిజ్య లోటు, కరెంటు ఖాతా లోటు వంటి అంశాలపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.