Imran Khan:మాజీ ప్రధానిని కలవాలని డిమాండ్ చేసినందుకు జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లారు..పాక్ జైలు వద్ద ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులపై దాడి
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్న అడియాలా జైలు వెలుపల మంగళవారం అర్ధరాత్రి పెద్ద ఘర్షణ చోటు చేసుకుంది. తన సోదరుడిని కలిసేందుకు వెళ్లిన ఇమ్రాన్ సోదరీమణులపై పాక్ పోలీసులు అత్యంత అమానుషంగా ప్రవర్తించారు. వారిని నేలపైకి నెట్టివేసి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి అదుపులోకి తీసుకున్న ఘటన ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. గత రెండు సంవత్సరాలుగా తోషాఖానా కేసు (రాజకీయ బహుమతుల కేసు) సహా ఇతర అవినీతి ఆరోపణల కారణంగా ఇమ్రాన్ ఖాన్ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం మంగళవారం ఆయన సోదరీమణులు - అలీమా ఖాన్, డాక్టర్ ఉజ్మా ఖాన్, నోరీన్ ఖాన్ - జైలుకు చేరుకున్నారు.
వివరాలు
పోలీసుల దాడిపై ఇమ్రాన్ సోదరి నోరీన్ ఖాన్ తీవ్ర ఆవేదన
కానీ, జైలు అధికారులు వారికి కలిసేందుకు అనుమతి ఇవ్వలేదు. ఫలితంగా, వారు దాదాపు 10 గంటల పాటు జైలు బయట నిరసన వ్యక్తం చేశారు. ఈ సమయంలోనే పోలీసులు వారిని బలవంతంగా అక్కడి నుంచి తొలగించేందుకు ప్రయత్నించారు. పోలీసుల దాడిపై ఇమ్రాన్ సోదరి నోరీన్ ఖాన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ, "ఒక మహిళా పోలీస్ అధికారి నా జుట్టు పట్టుకుని రోడ్డుపై లాగారు. నా కాళ్లను కూడా పట్టుకుని లాగారు.పంజాబ్ పోలీసులు రాక్షసుల్లా ప్రవర్తించారు.ఇంత దిగజారుతారని ఊహించలేదు"అని కన్నీటి పర్యంతమయ్యారు. మరో సోదరి అలీమా ఖాన్ మాట్లాడుతూ.. నోరీన్‌ను లాక్కెళ్తున్నప్పుడు ఆమె స్పృహ కోల్పోయే పరిస్థితికి వచ్చారని, పోలీసులు తమపై దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలు చేశారు.
వివరాలు
చీకట్లో దాడి.. ఆర్మీ చీఫ్‌పై ఆరోపణలు
ఈ ఘటనపై ఇమ్రాన్ ఖాన్ పార్టీ - పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరసన చోటు చేసుకున్న ప్రాంతంలో పోలీసులు లైట్లను ఆపివేసి, ఆ ప్రాంతాన్ని నీటితో నింపేసి భయానక వాతావరణం సృష్టించారని పార్టీ పేర్కొంది. చీకటిలోనే మహిళలపై పోలీసులు భౌతిక దాడి చేశారు అని PTI ఆరోపించింది. అలీమా ఖాన్ పోలీసుల ఈ దాడికి వెనుక పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఉన్నారని పేర్కొన్నారు. గత సెప్టెంబరులో కూడా ఇమ్రాన్ ఖాన్ తన కుటుంబంపై అసిమ్ మునీర్ నేరుగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని, దేశంలో ప్రస్తుతం ఆర్మీ నియంత్రణ చట్టం అమలులో ఉందని ఆమె వ్యాఖ్యానించారు.
వివరాలు
ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళన
ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి విషయంలో కూడా ఆయన కుటుంబ సభ్యులు కొద్దిరోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయనను ఏకాంత కారాగారంలో ఉంచి, కనీస మానవ హక్కులనూ కల్పించట్లేదని ఆయన కుటుంబ సభ్యులు కొద్ది రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోదరుడిని కలిసేందుకు వచ్చిన సోదరీమణులపై జరిగిన దాడి, పాకిస్థాన్ రాజకీయ వాతావరణంలో మరింత ఉద్రిక్తతను సృష్టించింది.