LOADING...
WHO: ఎట్టకేలకు ముగిసిన హాంటావైరస్ టెన్షన్.. అధికారికంగా ప్రకటించిన WHO
ఎట్టకేలకు ముగిసిన హాంటావైరస్ టెన్షన్.. అధికారికంగా ప్రకటించిన WHO

WHO: ఎట్టకేలకు ముగిసిన హాంటావైరస్ టెన్షన్.. అధికారికంగా ప్రకటించిన WHO

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 03, 2026
05:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగించిన హాంటావైరస్ వ్యాప్తికి అధికారికంగా ముగింపు పలికింది. చివరిగా వైరస్ బారినపడిన వ్యక్తితో సన్నిహితంగా ఉన్న వ్యక్తి కూడా 42 రోజుల ఆరోగ్య పర్యవేక్షణను పూర్తి చేసి, పరీక్షల్లో నెగెటివ్‌గా తేలడంతో ఈ వ్యాధి వ్యాప్తి పూర్తిగా అధికారికంగా ముగిసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది. దీంతో దాదాపు రెండు నెలలుగా కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. ఈ ఘటన ఎంవీ హోండియస్ క్రూయిజ్ నౌకలో చోటుచేసుకుంది. ఏప్రిల్ 1న అర్జెంటీనా నుంచి అంటార్కిటికా పర్యటనకు బయలుదేరిన ఈ నౌకలో ప్రయాణం కొనసాగుతున్న సమయంలో కొందరు ప్రయాణికులు తీవ్ర జ్వరం,శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు.

వివరాలు 

హాంటావైరస్ ఎలుకల ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది

అనంతరం నిర్వహించిన వైద్య పరీక్షల్లో వారికి అరుదైన ఆండీస్ హాంటావైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. సాధారణంగా హాంటావైరస్ ఎలుకల ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. అయితే ఈ ఘటనకు కారణమైన ఆండీస్ హాంటావైరస్ ప్రత్యేకత ఏమిటంటే,అరుదుగా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి కూడా సంక్రమించే అవకాశం ఉండటం. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య శాఖలు అప్రమత్తమయ్యాయి. ఈ వ్యాప్తిలో మొత్తం 13 మంది వైరస్ బారినపడగా, వారిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బాధితుల్లో బ్రిటన్, అమెరికా, నెదర్లాండ్స్, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్ తదితర దేశాలకు చెందిన ప్రయాణికులు ఉన్నారు. అదే సమయంలో ఈ నౌకలో పనిచేసిన భారత్‌కు చెందిన ఇద్దరు సిబ్బందిని కూడా ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా పర్యవేక్షణలో ఉంచారు.

వివరాలు 

ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు పలు దేశాల ప్రభుత్వాలు సమన్వయంతో చర్యలు

అయితే వారికి ఎలాంటి లక్షణాలు కనిపించలేదని, భారత ఆరోగ్య అధికారులు అప్పట్లో స్పష్టం చేశారు. దేశానికి తక్షణ ప్రమాదం లేదని కూడా వెల్లడించారు. వైరస్ వ్యాప్తి గుర్తించిన వెంటనే ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు పలు దేశాల ప్రభుత్వాలు సమన్వయంతో చర్యలు ప్రారంభించాయి. నౌకలోని ప్రయాణికులను ప్రత్యేక భద్రతా ఏర్పాట్లతో వారి స్వదేశాలకు తరలించి, 42 రోజుల పాటు నిరంతర ఆరోగ్య పర్యవేక్షణ నిర్వహించారు. అలాగే 33 దేశాల్లో వందలాది మంది కాంటాక్టులను గుర్తించి, వారిపై కూడా నిశితంగా నిఘా కొనసాగించారు. చివరిగా పర్యవేక్షణలో ఉన్న వ్యక్తి కూడా ఆరోగ్యంగా బయటపడటంతో వైరస్ సంక్రమణ పూర్తిగా నిలిచిపోయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా ప్రకటించింది. దీంతో హాంటావైరస్ వ్యాప్తి అధికారికంగా ముగిసింది.

Advertisement

వివరాలు 

ఎలుకల మూత్రం,విసర్జన లేదా వాటి ద్వారా కలుషితమైన ప్రదేశాలతో సంబంధం కలిగినప్పుడు ఈ వైరస్ సోకే అవకాశం

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం,హాంటావైరస్ సాధారణ పరిస్థితుల్లో మనుషుల మధ్య సులభంగా వ్యాపించే వైరస్ కాదు. ఎక్కువగా ఎలుకల మూత్రం,విసర్జన లేదా వాటి ద్వారా కలుషితమైన ప్రదేశాలతో సంబంధం కలిగినప్పుడు ఈ వైరస్ సోకే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఘటనలో గుర్తించిన ఆండీస్ హాంటావైరస్ మాత్రం అరుదుగా వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యాపించే లక్షణం కలిగి ఉండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించింది. ఈ వ్యాప్తి ముగియడం ప్రపంచానికి ఊరటనిచ్చినప్పటికీ, భవిష్యత్తులో ఇలాంటి అంటువ్యాధులు తలెత్తినప్పుడు దేశాల మధ్య వేగవంతమైన సమాచార మార్పిడి, తక్షణ పరీక్షలు, కాంటాక్ట్ ట్రేసింగ్, క్వారంటైన్ వంటి ప్రజారోగ్య చర్యలు ఎంత కీలకమో ఈ ఘటన మరోసారి స్పష్టం చేసిందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

Advertisement