Ali Jafari: అమెరికా వ్యూహాలకు అడ్డుకట్ట వేసిన 'మొజాయిక్ డిఫెన్స్'.. ఎవరీ వ్యూహకర్త జఫారీ?
ఈ వార్తాకథనం ఏంటి
దాదాపు 23 సంవత్సరాల క్రితం ఇరాక్‌పై యుద్ధం చేసిన అమెరికా,కేవలం నెలరోజుల్లోనే సద్దాం హుస్సేన్ సైన్యాన్ని పూర్తిగా ఓడించింది. అదే విధంగా ఇరాన్‌ను కూడా త్వరగా మట్టికరిపించవచ్చన్న నమ్మకంతో ఈసారి ఇజ్రాయెల్‌తో కలిసి యుద్ధరంగంలోకి దిగింది. మొదటి రోజే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అంతమొందించడంతో ఇరాన్ త్వరలోనే కూలిపోతుందని భావించింది. అయితే, ఇరాక్ యుద్ధంలో జరిగిన పరాజయాన్ని లోతుగా అధ్యయనం చేసి దానిని పాఠంగా మార్చుకున్న ఒక వ్యక్తి అమెరికా ప్రణాళికలకు అడ్డుకట్ట వేస్తాడని అగ్రరాజ్యం ఊహించలేదు. ఆ వ్యక్తి ఐఆర్‌జీసీ మాజీ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ మహమ్మద్ అలీ జఫారీ.
వివరాలు
జఫారీ రూపొందించిన 'మొజాయిక్' రక్షణ వ్యూహం
ఇరాన్ కీలక నేతలను కోల్పోయినప్పటికీ, దేశం రెండు వారాలుగా నిరంతరం పోరాడుతూ నిలబడటానికి ప్రధాన కారణం జఫారీ రూపొందించిన రక్షణ వ్యూహమే. మరి ఆయన ఎవరు? ఆయన రూపొందించిన వ్యవస్థ ఏమిటి? ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ అమలు చేస్తున్న ప్రధాన వ్యూహాల్లో 'డీసెంట్రలైజ్డ్ మొజాయిక్ డిఫెన్స్' సిద్ధాంతం అత్యంత కీలకంగా నిలుస్తోంది. పైస్థాయి నాయకత్వం నాశనం అయినా కూడా యుద్ధ సామర్థ్యం తగ్గకుండా పోరాటం కొనసాగించడమే ఈ వ్యూహం లక్ష్యం. ఈ సిద్ధాంతాన్ని రూపొందించినవారే అలీ జఫారీ. ఈ వ్యూహం ప్రకారం ముందుగానే రూపొందించిన ప్రణాళికల ఆధారంగా పనిచేసేలా పాక్షిక స్వతంత్ర యూనిట్లకు అధికారాలు అప్పగించారు.
వివరాలు
వికేంద్రీకరణ వ్యూహంపై వ్యాఖ్యానించిన ఇరాన్ విదేశాంగ మంత్రి
అందువల్లే ఫిబ్రవరి 28న జరిగిన దాడుల్లో సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీతో పాటు ఐఆర్‌జీసీ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ మహమ్మద్ పాక్పోర్, రక్షణ మంత్రి అజీజ్ నజీర్‌జాదే, సాయుధ బలగాల చీఫ్ వంటి కీలక నేతలు మరణించినప్పటికీ ఇరాన్ 13 రోజులుగా యుద్ధాన్ని కొనసాగిస్తూ ప్రతిఘటన చూపుతోంది. ఇటీవల ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కూడా ఈ వికేంద్రీకరణ వ్యూహంపై వ్యాఖ్యానించారు. గత రెండు దశాబ్దాల్లో తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో అమెరికా ఎదుర్కొన్న పరాజయాలను ఇరాన్ అధ్యయనం చేసిందని ఆయన చెప్పారు. ఆ అనుభవాల నుంచే పాఠాలు నేర్చుకుని రక్షణ వ్యవస్థను బలపరిచామని వెల్లడించారు.
వివరాలు
డీసెంట్రలైజ్డ్ మొజాయిక్ డిఫెన్స్
రాజధానిపై బాంబులు వేసినంత మాత్రాన ఇరాన్ యుద్ధ సామర్థ్యాన్ని తగ్గించలేరని, యుద్ధాన్ని ఎప్పుడు ముగించాలి, ఎక్కడ ముగించాలి అనే విషయంలో ఈ డీసెంట్రలైజ్డ్ మొజాయిక్ డిఫెన్స్ సిద్ధాంతమే తమకు మార్గదర్శకమని ఆయన అమెరికాను హెచ్చరించారు. ఈ వ్యూహంతో ఇరాన్ చివరికి విజయం సాధిస్తుందా లేదా అన్నది స్పష్టంగా చెప్పలేము. కానీ ఈ విధానాన్ని అమలు చేస్తున్న దేశాన్ని ఓడించడం అంత సులువు కాదన్న భావన మాత్రం పశ్చిమ దేశాల్లో పెరుగుతోంది.
వివరాలు
ఎవరు ఈ జఫారీ?
ఇరాన్‌కు చెందిన మిలిటరీ అధికారి మేజర్ జనరల్ మహమ్మద్ అలీ జఫారీ తన కెరీర్‌ను ఐఆర్‌జీసీ ఇంటెలిజెన్స్ విభాగంలో ప్రారంభించారు. ఇస్లామిక్ విప్లవం అనంతరం ఆయన కుర్దిస్థాన్ ప్రావిన్స్‌లో సేవలందించారు. 1979 నుంచి 1989 వరకు సాగిన ఇరాన్-ఇరాక్ యుద్ధంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆ తరువాత మిలిటరీలో క్రమంగా ఉన్నత స్థానాలకు ఎదిగారు. యుద్ధం ముగిసిన తర్వాత ఐఆర్‌జీసీ గ్రౌండ్ ఫోర్సెస్‌కు కమాండర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2005లో ఐఆర్‌జీసీ సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్‌కు డైరెక్టర్‌గా ఎంపికయ్యారు.
వివరాలు
ఇరాక్ కమాండ్ వ్యవస్థ ధ్వంసం చేసిన అమెరికా
అంతకు రెండేళ్ల ముందు అమెరికా నిర్వహించిన'ఆపరేషన్ ఇరాకీ ఫ్రీడమ్'ను ఆయన లోతుగా అధ్యయనం చేశారు. ఆ యుద్ధంలో అమెరికా ముందుగా ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్‌కు చుట్టూ ఉన్న ఉన్నతస్థాయి కమాండ్ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని దానిని ధ్వంసం చేసింది. దాంతో ఇరాక్ సైన్యం,రిపబ్లికన్ గార్డ్ యూనిట్ల మధ్య సమన్వయం పూర్తిగా దెబ్బతింది. సద్దాం అనుమతి లేకుండా నిర్ణయాలు తీసుకునే వ్యవస్థ అక్కడ లేకపోవడం వల్ల కమాండ్ నిర్మాణం కూలిపోయిన తర్వాత కింది స్థాయి దళాలకు ఆదేశాలు చేరడం కష్టమైంది. ఫలితంగా ఇరాక్ బలగాలు స్వతంత్రంగా యుద్ధం చేయలేక చివరకు అమెరికాకు లొంగిపోయాయి. ఈ పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలించిన జఫారీ,భవిష్యత్తులో ఇరాన్‌కు ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు 'మొజాయిక్ డిఫెన్స్ వ్యూహం'ను రూపొందించారు.
వివరాలు
ఎలా పనిచేస్తుంది ఈ వ్యవస్థ?
2007లో ఐఆర్‌జీసీ కమాండర్ ఇన్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన ఈ వ్యూహాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఈవ్యూహం ప్రకారం ఐఆర్‌జీసీని 31పాక్షిక స్వతంత్ర ప్రావిన్షియల్ కమాండ్లుగా విభజించారు. అధికారాన్ని పూర్తిగా వికేంద్రీకరించారు.ప్రతి కమాండ్‌కు ప్రత్యేక హెడ్‌క్వార్టర్, కమాండ్ కంట్రోల్ కేంద్రాలు,క్షిపణులు,డ్రోన్లు వంటి ఆయుధ వ్యవస్థలు ఉంటాయి. అస్త్రాలను నిల్వ చేయడం,నిఘా వ్యవస్థలను బలపరచడం,స్వతంత్రంగా ఆపరేషన్లు నిర్వహించడం వంటి బాధ్యతలు ఈ కమాండ్లకే అప్పగించారు. అత్యవసరపరిస్థితుల్లో పైస్థాయి ఆదేశాలు లేకున్నా కూడా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని వీటికి ఇచ్చారు. ఆ నిర్ణయాలు ఎలా ఉండాలి అనే దానిపై ముందుగానే వ్యూహాత్మక ప్రణాళికలు సిద్ధం చేస్తారు. ఇప్పుడు ఇదే మొజాయిక్ డిఫెన్స్ సిద్ధాంతాన్ని ఇరాన్ కచ్చితంగా అమలు చేస్తూ అమెరికా దాడులను ఎదుర్కొంటోంది.