Andy Burnham: బ్రిటన్ తదుపరి ప్రధాని రేసులో ఆండీ బర్న్‌హామ్.. ఎవరీ 'కింగ్ ఆఫ్ ది నార్త్'?
ఈ వార్తాకథనం ఏంటి
గత కొన్నేళ్లుగా రాజకీయ పరిణామాలతో తరచూ చర్చనీయాంశంగా మారుతున్న యునైటెడ్ కింగ్డమ్‌లో మరోసారి నాయకత్వంపై దృష్టి కేంద్రీకృతమైంది. దేశ రాజకీయాల్లో కీలక మార్పుల నేపథ్యంలో తదుపరి ప్రధానమంత్రి ఎవరు అనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో లేబర్ పార్టీలో ప్రముఖ నాయకుడిగా గుర్తింపు పొందిన ఆండీ బర్న్‌హామ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఉత్తర ఇంగ్లాండ్‌లో బలమైన ప్రజాదరణ సంపాదించుకున్న ఆయనను అభిమానులు 'కింగ్ ఆఫ్ ది నార్త్'గా సంబోధిస్తుంటారు.
వివరాలు
మళ్లీ పార్లమెంట్‌లోకి..
గ్రేటర్ మాంచెస్టర్ మేయర్‌గా సేవలందించిన ఆండీ బర్న్‌హామ్ ఇటీవల జరిగిన మేకర్‌ఫీల్డ్ ఉప ఎన్నికలో విజయం సాధించి తిరిగి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. దీంతో జాతీయ రాజకీయాల్లో ఆయన పాత్ర మరోసారి ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న లేబర్ పార్టీలో కీలక నేతగా ఉన్న బర్న్‌హామ్,పార్టీ భవిష్యత్ నాయకత్వంపై జరుగుతున్న చర్చల్లో ప్రధానంగా నిలుస్తున్నారు. ప్రజల విశ్వాసం లభిస్తే దేశ రాజకీయాల్లో మార్పు తీసుకురాగలననే ధీమాను ఆయన పలుమార్లు వ్యక్తం చేశారు.
వివరాలు
రాజకీయ ప్రస్థానం ఇలా..
ఆండీ ముర్రే బర్న్‌హామ్ 1970లో వాయువ్య ఇంగ్లాండ్‌లోని మెర్సీసైడ్ ప్రాంతంలో జన్మించారు. చిన్ననాటి నుంచే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న ఆయన లేబర్ పార్టీలో చేరి ప్రజా జీవితాన్ని ప్రారంభించారు. 2001 నుంచి 2017 వరకు పార్లమెంట్ సభ్యుడిగా సేవలందించారు.మాజీ ప్రధాని గార్డన్ బ్రౌన్ ప్రభుత్వంలో ట్రెజరీ,సాంస్కృతిక శాఖ, ఆరోగ్య శాఖలతో పాటు పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. లేబర్ పార్టీ నాయకత్వం కోసం గతంలో రెండుసార్లు ప్రయత్నించినప్పటికీ ఆయనకు విజయం దక్కలేదు. 2015, 2017 సంవత్సరాల్లో పార్టీ నేతగా అవతరించేందుకు పోటీ పడి విఫలమయ్యారు. అనంతరం జాతీయ రాజకీయాల కంటే స్థానిక పరిపాలనపై దృష్టి సారించి 2017లో గ్రేటర్ మాంచెస్టర్ మేయర్‌గా ఎన్నికయ్యారు. అదే ఆయన రాజకీయ జీవితంలో కీలక మలుపుగా మారింది.
వివరాలు
'కింగ్ ఆఫ్ ది నార్త్' పేరు ఎలా వచ్చింది?
2020లో కరోనా మహమ్మారి సమయంలో ఆండీ బర్న్‌హామ్ జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు కారణమయ్యారు. లాక్‌డౌన్ ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉత్తర ఇంగ్లాండ్ ప్రాంతాలకు తగిన ఆర్థిక సాయం అందించడం లేదంటూ అప్పటి ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అభివృద్ధి,నిధుల కేటాయింపుల విషయంలో ఉత్తర ఇంగ్లాండ్‌కు అన్యాయం జరుగుతోందని బహిరంగంగా ఆరోపించారు. ఈ అంశాలపై ఆయన చేసిన పోరాటం ప్రజల్లో విశేష స్పందన తెచ్చింది. మీడియా,సోషల్ మీడియాలో ఆయన పేరు విస్తృతంగా వినిపించింది. ఉత్తర ఇంగ్లాండ్ ప్రయోజనాల కోసం గట్టిగా నిలబడిన నాయకుడిగా గుర్తింపు రావడంతో అభిమానులు ఆయనకు 'కింగ్ ఆఫ్ ది నార్త్' అనే బిరుదు ఇచ్చారు.
వివరాలు
మేయర్‌గా ప్రత్యేక గుర్తింపు
ప్రముఖ టెలివిజన్ సిరీస్ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'లోని ఉత్తర ప్రాంతాల పాలకులను గుర్తు చేసేలా ఈ పేరు ప్రాచుర్యం పొందింది. గ్రేటర్ మాంచెస్టర్ మేయర్‌గా ఆండీ బర్న్‌హామ్ చేపట్టిన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి. ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం,యువతకు ఉపాధి అవకాశాలు పెంచే నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం, అందుబాటు ధరల్లో గృహ నిర్మాణాలను ప్రోత్సహించడం వంటి చర్యలు ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. స్థానిక పాలనలో సాధించిన విజయాలే ఆయనకు జాతీయ రాజకీయాల్లో మరింత గుర్తింపు తెచ్చాయి. ఇప్పుడు తిరిగి పార్లమెంట్‌లోకి వచ్చిన బర్న్‌హామ్, లేబర్ పార్టీ భవిష్యత్ నాయకత్వ పోటీలో కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.