UnitedHealthcare CEO: యునైటెడ్ హెల్త్‌కేర్ CEO హత్యలో అరెస్టయిన 26 ఏళ్ల లుయిగి మాంగియోన్ ఎవరు?
యునైటెడ్ హెల్త్‌కేర్ సంస్థ సీఈవో బ్రియాన్ థాంప్సన్‌ను కొన్ని రోజుల క్రితం న్యూయార్క్ నగరంలో హత్య చేసిన ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో అమెరికా పోలీసులు ప్రగతి సాధించి, 26 సంవత్సరాల నిందితుడు లుగి మాంగియోన్‌ను కస్టడీలోకి తీసుకున్నారు. అతన్ని పెన్సిల్వేనియాలోని అల్టూనా పట్టణంలోని మెక్‌డోనాల్డ్స్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద త్రీడీ ప్రింట్ గన్‌తో పాటు చేయితో రాసిన డాక్యుమెంట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతనిపై హత్య, ఫైర్ ఆర్మ్స్ అభియోగాలు లేవనెత్తడంతో పాటు ఐదు కేసులు నమోదు చేశారు. నిందితుడికి బెయిల్ ను నిరాకరించారు. గత బుధవారం మన్‌హట్టన్‌లోని హిల్టన్ హోటల్ బైట బ్రియాన్ థాంప్సన్‌ను కాల్చి హత్య చేశారు.
పోలీసులకు తప్పుగా ఐడెంటిఫికేషన్ ఇచ్చినట్లు ఆరోపణలు
ఆరోజు యునైటెడ్ హెల్త్‌కేర్ సంస్థ ఇన్వెస్టర్లతో సమావేశం నిర్వహిస్తోంది. ఈహత్య అనేది ప్రీప్లాన్డ్‌గా జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.షూటింగ్ సంఘటన తర్వాత నిందితుడి కోసం న్యూయార్క్ సిటీలో పెద్ద ఎత్తున గాలింపు నిర్వహించబడింది. ప్రపంచంలోని అత్యుత్తమ డిజిటల్ సర్వైలెన్స్ వ్యవస్థలు,పోలీసు శునకాలు,డ్రోన్లను ఉపయోగించి ఆ గాలింపు సాగింది. మాంగియోన్ పై లైసెన్సు లేని ఆయుధాన్ని కలిగి ఉన్న కారణంగా పెన్సిల్వేనియా జైలులో బంధించారు. అతను పోలీసులకు తప్పుగా ఐడెంటిఫికేషన్ ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితుడి బ్యాక్‌ప్యాక్ లో ఓ త్రీడీ ప్రింట్ పిస్తోల్,త్రీడీ ప్రింట్ సైలెన్సర్,లోడెడ్ మ్యాగ్జిన్,ఆరు రౌండ్ల 9ఎఎం అమ్యూనిషన్,పాస్‌పోర్టు తో పాటు పది వేల డాలర్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రెండు వేల డాలర్ల విదేశీ కరెన్సీ కూడా ఉంది.