LOADING...
Neal Katyal: ట్రంప్‌ కేసులో వాదించనున్న భారత మూలాల న్యాయవేత్త నీల్‌ కత్యాల్‌.. ఎవరీ భారత సంతతి లాయర్‌..? 
ఎవరీ భారత సంతతి లాయర్‌..?

Neal Katyal: ట్రంప్‌ కేసులో వాదించనున్న భారత మూలాల న్యాయవేత్త నీల్‌ కత్యాల్‌.. ఎవరీ భారత సంతతి లాయర్‌..? 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 04, 2025
04:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా చరిత్రలో అత్యంత ప్రాధాన్యమైన న్యాయవిచారణగా నిలవబోయే ఒక కేసు కోసం అగ్రరాజ్య సుప్రీంకోర్టు సన్నద్ధమవుతోంది. వాణిజ్య రక్షణ చర్యల పేరుతో ప్రపంచవ్యాప్తంగా సుంకాలు (టారిఫ్‌లు) విధించి వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ అధికార పరిధి ఎంతవరకు ఉండాలన్నది ఈ విచారణలో నిర్ణయించబడనుంది. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం ఈ కేసు వాదనలు జరుగనున్నాయి. ట్రంప్‌ తరఫున కాకుండా, ఆయన విధానాలకు వ్యతిరేకంగా వాదించనున్న వారిలో భారత మూలాలున్న అటార్నీ నీల్‌ కత్యాల్‌ (Neal Katyal) ప్రధానంగా నిలిచారు. ప్రస్తుతం ఆయన పేరు అంతర్జాతీయ మీడియా అంతటా ప్రస్తావనలో ఉంది. మరి ఎవరు ఈ నీల్‌ కత్యాల్‌?

వివరాలు 

భారత మూలాల న్యాయవేత్త - నీల్‌ కత్యాల్‌ 

54 ఏళ్ల నీల్‌ కత్యాల్‌ షికాగోలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు భారతదేశం నుంచి వలస వచ్చిన వారు. యేల్‌ లా స్కూల్‌లో న్యాయవిద్యను అభ్యసించి, తరువాత అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా పాలనలో యూఎస్‌ సొలిసిటర్‌ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పటివరకు అమెరికా సుప్రీంకోర్టు ముందు ఆయన 50కి పైగా కేసులను వాదించి న్యాయరంగంలో విశిష్ట గుర్తింపు పొందారు.

వివరాలు 

ట్రంప్‌ విధానాలను వ్యతిరేకిస్తూ.. 

ట్రంప్‌ విధానాలను సవాలు చేస్తూ నీల్‌ కత్యాల్‌ గతంలో కూడా పలు సందర్భాల్లో న్యాయపరంగా పోరాడారు. 2017లో ట్రంప్‌ కొన్ని ముస్లింల దేశాలపై విధించిన ప్రయాణ నిషేధానికి వ్యతిరేకంగా ఆయన వాదనలు వినిపించారు. అదే సమయంలో "ఇంపీచ్‌: ది కేస్‌ అగైనెస్ట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌" అనే పుస్తకాన్ని కూడా రచించారు. తాజాగా, ట్రంప్‌ అమలు చేసిన సుంక విధానాలను వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలు చేసిన చిన్న వ్యాపారులు, డెమోక్రటిక్‌ రాష్ట్రాల కూటమి తరఫున ఆయన సుప్రీంకోర్టులో వాదించబోతున్నారు.

వివరాలు 

టారిఫ్‌ల వివాదం - చట్టపరమైన ప్రశ్నలు 

ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, మిత్రదేశాలు-శత్రుదేశాలు అనే తేడా లేకుండా అనేక దేశాలపై భారీ సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఇందుకోసం ఆయన "ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఎమర్జెన్సీ పవర్స్ యాక్ట్" (International Economic Emergency Powers Act) చట్టాన్ని ఆధారంగా తీసుకున్నారు. కానీ, ఈ చట్టాన్ని ఉపయోగించే క్రమంలో ట్రంప్‌ ఫెడరల్‌ చట్టాలను ఉల్లంఘించారన్న ఆరోపణలు వచ్చాయి. కొన్ని దిగువ న్యాయస్థానాలు ఆయన నిర్ణయాలను అడ్డుకోవడంతో, అమెరికా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై బుధవారం విచారణ జరగనుంది.

వివరాలు 

విచారణకు ట్రంప్‌ దూరం.. 

ఈ కేసు విచారణకు ట్రంప్‌ ప్రత్యక్షంగా హాజరుకావాలని తొలుత భావించారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఆ ఆలోచనను విరమించుకున్నారు. ప్రభుత్వం తరఫున ట్రెజరీ సెక్రటరీ స్కాట్‌ బెసెంట్‌ విచారణకు హాజరుకానున్నారు. ఇదే విషయంపై ట్రంప్‌ సోషల్‌ మీడియాలో స్పందిస్తూ.."ఈ కేసులో మేము గెలిస్తే, అమెరికా ప్రపంచంలో అత్యంత ధనిక, సురక్షిత దేశంగా నిలుస్తుంది. కానీ ఓడిపోతే పేద దేశంగా మారుతుంది. అలా జరగకూడదని దేవుడిని ప్రార్థిస్తున్నాను" అని పేర్కొన్నారు.