LOADING...
Parastoo Ahmadi: హిజాబ్ లేకుండా యూట్యూబ్‌లో పాట.. ఇరాన్ గాయని పరస్తూ అహ్మదీకి 74 కొరడా దెబ్బల శిక్ష!
ఇరాన్ గాయని పరస్తూ అహ్మదీకి 74 కొరడా దెబ్బల శిక్ష!

Parastoo Ahmadi: హిజాబ్ లేకుండా యూట్యూబ్‌లో పాట.. ఇరాన్ గాయని పరస్తూ అహ్మదీకి 74 కొరడా దెబ్బల శిక్ష!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 19, 2026
01:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌కు చెందిన ప్రముఖ స్వతంత్ర గాయని, సినీ దర్శకురాలు పరస్తూ అహ్మదీ (Parastoo Ahmadi) మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. హిజాబ్ ధరించకుండా యూట్యూబ్‌లో సంగీత కార్యక్రమం నిర్వహించిన కేసులో ఆమెకు ఇరాన్ కోర్టు 74 కొరడా దెబ్బల శిక్ష విధించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఆమెతో పాటు ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఎనిమిది మంది సంగీతకారులు, నిర్మాణ బృంద సభ్యులకూ ఇదే తరహా శిక్షలు విధించినట్లు సమాచారం. 1997 మార్చి 21న జన్మించిన పరస్తూ అహ్మదీ,ఇరాన్‌లోని సౌరెహ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుంచి ఫిల్మ్ డైరెక్షన్‌లో పట్టా పొందారు. ఇరానియన్ సాంప్రదాయ,శాస్త్రీయ,జానపద సంగీతంలో ఆమె ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గాయనిగానే కాకుండా దర్శకురాలు,సంగీత స్వరకర్తగానూ ఆమె పేరు సంపాదించారు.

వివరాలు 

హిజాబ్ లేకుండా వేదికపై పరస్తూ..

ఇరాన్‌లో కళా స్వేచ్ఛ కోసం గొంతెత్తే యువ కళాకారిణుల్లో ఆమె ఒకరిగా గుర్తింపు పొందారు. 2024 డిసెంబరులో ఇరాన్‌లోని చారిత్రక దయ్ర్-ఎ-గచిన్ కారవాన్‌సరాయ్ వద్ద ఆమె "ఊహాత్మక సంగీత కచేరీ"(imaginary concert) పేరుతో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తన యూట్యూబ్ ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఇందులో పరస్తూ హిజాబ్ లేకుండా వేదికపై కనిపించడంతో పాటు, ఇరాన్ స్వాతంత్ర్య ఉద్యమాలకు ప్రతీకగా భావించే దేశభక్తి గీతం "అజ్ ఖూనే జవానానే వతన్" (Az Khoon-e Javanan-e Vatan) ఆలపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి మిలియన్ల కొద్దీ వీక్షణలు సాధించింది.

వివరాలు 

పోలీసులు అదుపులో పరస్తూ అహ్మదీతో పాటు పలువురు సంగీతకారులు 

అయితే,ఇరాన్‌లో అమల్లో ఉన్న కఠిన నిబంధనల ప్రకారం మహిళలు హిజాబ్ ధరించడం తప్పనిసరి. అలాగే మిశ్రమ ప్రేక్షకుల ముందు మహిళలు ఒంటరిగా పాటలు పాడటంపై కూడా పరిమితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కార్యక్రమం అనంతరం పరస్తూ అహ్మదీతో పాటు పలువురు సంగీతకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొద్ది రోజుల తర్వాత వారిని విడుదల చేసినప్పటికీ, వీడియో ప్రచురణపై అధికారికంగా కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసులో కోర్టు ఆమెకు 74కొరడా దెబ్బల శిక్షతో పాటు,మరో రెండేళ్ల పాటు దేశం విడిచి వెళ్లకుండా నిషేధం విధించినట్లు సమాచారం. అదనంగా రెండేళ్లపాటు కళారంగానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఆంక్షలు విధించారనే వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ తీర్పును ఇరాన్ న్యాయవ్యవస్థ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు.

Advertisement

వివరాలు 

ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న మానవ హక్కుల సంస్థలు

మానవ హక్కుల సంస్థలు మాత్రం ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కళాకారులపై ఇలాంటి చర్యలు తీసుకోవడం ద్వారా సాంస్కృతిక స్వేచ్ఛను అణిచివేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని విమర్శిస్తున్నాయి. ముఖ్యంగా, ఇరాన్‌లో మహిళల హక్కులు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ విషయంలో పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాలేదనడానికి పరస్తూ అహ్మదీ కేసు తాజా ఉదాహరణగా నిలుస్తోందని హక్కుల కార్యకర్తలు పేర్కొంటున్నారు.

Advertisement