Page Loader
Claudia Sheinbaum: "మేము USని 'మెక్సికన్ అమెరికా' అని ఎందుకు పిలవకూడదు" : ట్రంప్‌కు మెక్సికో అధ్యక్షురాలు చురక
ట్రంప్‌కు మెక్సికో అధ్యక్షురాలు చురక

Claudia Sheinbaum: "మేము USని 'మెక్సికన్ అమెరికా' అని ఎందుకు పిలవకూడదు" : ట్రంప్‌కు మెక్సికో అధ్యక్షురాలు చురక

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 09, 2025
09:09 am

ఈ వార్తాకథనం ఏంటి

డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అగ్రరాజ్య అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతుండగా, ప్రమాణస్వీకారం చేయకముందే పొరుగు దేశాలతో వివాదాలకు దారితీశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కెనడా, గ్రీన్‌లాండ్, పనామా కాలువలను అమెరికాతో విలీనం చేస్తానని, గల్ఫ్ ఆఫ్ మెక్సికోను "గల్ఫ్ ఆఫ్ అమెరికా"గా మార్చుతానని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ ప్రకటనలపై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్ తీవ్రంగా స్పందించారు. ఆమె ట్రంప్ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇస్తూ, "అమెరికాను 'మెక్సికన్ అమెరికా' అని ఎందుకు పిలవకూడదు?" అని చురకలంటించారు.

వివరాలు 

ఉత్తర అమెరికాను "మెక్సికన్ అమెరికా" అని పిలిచేవారు 

బుధవారం క్లాడియా మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా, 17వ శతాబ్దం నాటి ప్రపంచపటాన్ని చూపించారు. అప్పట్లో ఉత్తర అమెరికాను "మెక్సికన్ అమెరికా" అని పిలిచేవారని గుర్తుచేశారు. "గల్ఫ్ ఆఫ్ మెక్సికోను ఐక్యరాజ్య సమితి గుర్తించిందన్న విషయం ట్రంప్ మరచిపోకూడదు. మనం కూడా యునైటెడ్ స్టేట్స్‌ను 'మెక్సికన్ అమెరికా' అని పిలవవచ్చు. వినడానికి చాలా బాగుంది కదా?" అంటూ ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని తాము కోరుకుంటున్నామని క్లాడియా స్పష్టం చేశారు.

వివరాలు 

మా దేశంలోకి అక్రమంగా ప్రవేశించకుండా మెక్సికో అడ్డుకోవాలి: ట్రంప్ 

జనవరి 20న ట్రంప్ నూతన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే, ఇటీవల ఆయన తనలోని విస్తరణ కాంక్షను బహిరంగంగా వ్యక్తం చేశారు. "గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చడం సరైన నిర్ణయం. మెక్సికో తమ దేశంలోకి అక్రమ ప్రవేశాలను అడ్డుకోవాలి. అక్కడి మాదకద్రవ్య ముఠాలు ఆ దేశాన్ని నడుపుతున్నాయి," అని ట్రంప్ విమర్శించారు. అంతేకాకుండా, మెక్సికో అక్రమ వలసదారులు, డ్రగ్స్ రవాణాను నియంత్రించకపోతే టారిఫ్‌లు కఠినంగా విధిస్తామని ఆయన హెచ్చరించారు.