Loading...
USA: అమెరికా నుంచి బంగారం ఎందుకు తరలిపోతోంది? తెరపైకి వచ్చిన అసలు కారణం ఇదే!
అమెరికా నుంచి బంగారం ఎందుకు తరలిపోతోంది? తెరపైకి వచ్చిన అసలు కారణం ఇదే!

USA: అమెరికా నుంచి బంగారం ఎందుకు తరలిపోతోంది? తెరపైకి వచ్చిన అసలు కారణం ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 06, 2026
04:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, వాణిజ్య ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి కొనసాగుతున్న వేళ.. వివిధ దేశాలు అమెరికాలో దాచుకున్న తమ బంగారాన్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తుండటం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా నెదర్లాండ్స్‌.. ఇప్పటివరకు అమెరికాలో భద్రపరిచిన తన బంగారంలో కొంత భాగాన్ని లండన్‌కు తరలించింది. దీనికి నెదర్లాండ్స్‌ చెబుతున్న కారణం మరింత ఆసక్తికరంగా ఉంది. 'సంక్లిష్ట సంక్షోభానికి ముందస్తు తయారీ'లో భాగంగానే ఈ చర్య తీసుకున్నట్లు ఆ దేశం పేర్కొంది. అయితే అసలు ఏం జరుగుతోంది? వివిధ దేశాలు అమెరికా నుంచి తమ బంగారాన్ని ఎందుకు తరలిస్తున్నాయనే ప్రశ్న ఇప్పుడు చర్చకు దారితీస్తోంది.

వివరాలు

అమెరికా నుంచి బంగారం తరలిస్తున్న ఐరోపా దేశాలు

నెదర్లాండ్స్‌ ఒక్కటే ఈ నిర్ణయం తీసుకోలేదు.

కొద్దికాలం క్రితం ఫ్రాన్స్‌, జర్మనీ సహా పలు ఐరోపా దేశాల కేంద్ర బ్యాంకులు కూడా ఎన్నో ఏళ్లుగా అమెరికాలో భద్రపరుచుకున్న టన్నుల కొద్దీ బంగారాన్ని ఇతర ప్రాంతాలకు తరలించాయి.

ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఐరోపా దేశాలు ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలపై నిపుణులు విశ్లేషిస్తున్నారు.

సమీప భవిష్యత్తులో ఏదైనా తీవ్రమైన ఆర్థిక కుదుపు సంభవించవచ్చని ఈ దేశాలు అంచనా వేస్తున్నాయా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

అయితే ప్రస్తుతం 'తీవ్రమైన ఆర్థిక సంక్షోభం రాబోతోంది' అని చెప్పడానికి ఎలాంటి స్పష్టమైన పరిస్థితులు లేవని నిపుణులు చెబుతున్నారు.

వివరాలు

యుద్ధాలు, వాణిజ్య ఉద్రిక్తతల ప్రభావం

నెదర్లాండ్స్‌ పేర్కొన్నట్లుగా ఇది సంక్లిష్ట ఆర్థిక సంక్షోభాన్ని ఊహించి తీసుకున్న నిర్ణయం కంటే.. ప్రస్తుత ప్రపంచ భౌగోళిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా భావించవచ్చని విశ్లేషిస్తున్నారు.

యుద్ధాలు, వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు తమ బంగారం నిల్వలను ఉపయోగిస్తుంటాయి.

అవసరమైతే బంగారాన్ని విక్రయించడం, తనఖా పెట్టడం ద్వారా ద్రవ్యలభ్యతను పెంచుకోవచ్చు.

తద్వారా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు కొంత వెసులుబాటు లభిస్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న సాయుధ ఘర్షణలు,

ADVERTISEMENT

వివరాలు

ద్రవ్యోల్బణాన్ని మరింత తీవ్రతరమయ్యే అవకాశం

ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్‌, అమెరికా-ఇరాన్‌ యుద్ధాలు.. ద్రవ్యోల్బణాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి.

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ దేశాలపై వాణిజ్య సుంకాలు విధిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి పెరిగింది.

దీర్ఘకాల మిత్రదేశం, పొరుగున ఉన్న కెనడాపై కూడా ట్రంప్‌ ప్రభుత్వం కఠిన వైఖరి ప్రదర్శిస్తున్న నేపథ్యంలో.. అమెరికాలో ప్రచ్ఛన్న యుద్ధ కాలం నుంచి భద్రపరుస్తూ వస్తున్న తమ బంగారం నిల్వల విషయంలో ఐరోపా దేశాలు వ్యూహాలను మార్చుకుంటున్నాయి.

ADVERTISEMENT

వివరాలు

లండన్‌కు తరలింపు ఎందుకు?

అమెరికా, కెనడాల్లో కలిపి నెదర్లాండ్స్‌ వద్ద 313 టన్నుల బంగారం నిల్వ ఉంది.

ఇందులో సుమారు 86 టన్నుల బంగారాన్ని నెదర్లాండ్స్‌ లండన్‌లోని బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ ఖజానాకు తరలించింది.

అదేవిధంగా జర్మనీకి చెందిన బుందెష్‌బ్యాంక్‌ కూడా కొన్ని నెలల క్రితం న్యూయార్క్‌ నుంచి 111 టన్నుల బంగారాన్ని తరలించినట్లు వెల్లడించింది.

ఫ్రాన్స్‌ నుంచి కూడా ఇదే తరహా ప్రకటన వెలువడింది. ఈ దేశాలన్నీ తమ బంగారాన్ని లండన్‌లోని బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ ఖజానాకు తరలించడం గమనార్హం.

వివరాలు

ప్రపంచంలోనే సురక్షితమైన బంగారం నిల్వ కేంద్రం

బంగారం నిల్వలకు లండన్‌లోని బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ప్రాంతాల్లో ఒకటిగా శతాబ్దాలుగా పేరుగాంచింది.

సెంట్రల్‌ లండన్‌లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో కూడిన భారీ నేలమాళిగలు అక్కడ ఉన్నాయి.

అక్కడ బంగారాన్ని నిల్వ ఉంచడం వల్ల మరో ప్రాంతానికి తరలించాల్సిన అవసరం లేకుండానే అవసరమైన సమయంలో విక్రయించుకునే అవకాశం ఉంటుంది.

కేవలం ఖాతాల్లో సర్దుబాట్లు చేయడం ద్వారా బంగారాన్ని కొనుగోలు చేయడం, విక్రయించడం సాధ్యమవుతుంది.

ప్రపంచవ్యాప్తంగా బంగారం క్రయవిక్రయాలకు లండన్‌ అత్యంత కీలకమైన కేంద్రంగా ఉండటంతో.. బంగారం నిల్వలను అమెరికా నుంచి వ్యూహాత్మకంగా లండన్‌కు తరలించడమే మెరుగైన నిర్ణయమని వివిధ దేశాలు భావిస్తున్నాయి.

వివరాలు

5వేల టన్నుల బంగారాన్నినిల్వ చేసే సామర్థ్యం

సమాచారం ప్రకారం.. బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ ఖజానాలో ఏకంగా 5,000 టన్నుల వరకు బంగారాన్ని నిల్వ చేసే సామర్థ్యం ఉంది.

అందుకే భద్రతతో పాటు బంగారం క్రయవిక్రయాలకు ఉన్న సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఐరోపా దేశాలు తమ నిల్వలను లండన్‌కు తరలిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

ADVERTISEMENT