Marco Rubio: చైనా పర్యటనలో 'మార్కో లూ'గా మారిన అమెరికా విదేశాంగ మంత్రి.. కారణమేంటి?
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం తన మంత్రివర్గ సభ్యులతో కలిసి చైనాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు సంబంధించిన ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. చైనా పర్యటన కోసం ఆయన తన పేరులో మార్పు చేసుకుని 'మార్కో లూ' పేరుతో అక్కడ అడుగుపెట్టడం చర్చనీయాంశంగా మారింది. అమెరికా-చైనా దేశాల మధ్య ఎన్నో అంశాల్లో చాలా కాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన, వీగర్ ముస్లింల పరిస్థితిపై అమెరికా తరచుగా చైనాపై విమర్శలు చేస్తోంది. సెనెటర్‌గా పనిచేసిన సమయంలో మార్కో రూబియో కూడా చైనాపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. చైనా కమ్యూనిస్టు పార్టీని లక్ష్యంగా చేసుకుని పలు ఆరోపణలు చేశారు.
వివరాలు
2020 నుంచి మార్కో రూబియోపై చైనా ప్రవేశ నిషేధం
వీగర్ ముస్లింలపై చైనా జాతి నిర్మూలన చర్యలకు పాల్పడుతోందని ఆయన గతంలో పలు సందర్భాల్లో ఆరోపించారు. లక్షలాది మంది వీగర్లు, ఇతర ముస్లింలను శిబిరాల్లో నిర్బంధించి బలవంతపు పనులు చేయిస్తున్నారని విమర్శించారు. వీగర్ మహిళలు లైంగిక హింసకు గురవుతున్నారని పేర్కొంటూ కొన్నేళ్ల క్రితం ఒక వీడియో కూడా విడుదల చేశారు. రూబియో చేసిన ఈ వ్యాఖ్యలు అప్పట్లో చైనాకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. దీంతో 2020 నుంచి ఆయనపై చైనా ప్రవేశ నిషేధం విధించింది. ఇప్పటికీ ఆ ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ ప్రస్తుత అమెరికా విదేశాంగ మంత్రిగా ఆయనకు ఉన్న దౌత్యపరమైన వెసులుబాటుతో ఈ పర్యటన సాధ్యమైంది.
వివరాలు
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తో ట్రంప్ సమావేశం
అదే సమయంలో తన ఇంటి పేరుకు బదులుగా చైనాకు అనుకూలంగా వినిపించే 'లూ' అనే పదాన్ని ఉపయోగించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం మధ్యాహ్నం చైనాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తో సమావేశమయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంతర్జాతీయ అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా తైవాన్ అంశం ఇద్దరి మధ్య ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
వివరాలు
ట్రంప్ చైనా పర్యటనపై ఆసక్తి
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభ పరిస్థితులు నెలకొన్న వేళ ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా ఇరాన్ నుంచి అత్యధిక ముడి చమురును దిగుమతి చేసుకునే దేశంగా చైనా ఉండటంతో ఇరాన్ అంశం కూడా చర్చకు వస్తుందా అన్న ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. ఈ నేపథ్యంలో ట్రంప్ చైనా పర్యటనపై అంతర్జాతీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.