
#NewsBytesExplainer: తెలుగు వాళ్లను పెద్ద ఎత్తున తీసేసిన అమెరికా దిగ్గజ సంస్థ 'ఫ్యానీ మే'
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో నివసిస్తున్న తెలుగు వారికి సేవ చేయాలనే ఉన్నతమైన సంకల్పంతో ప్రారంభమైన తెలుగు సంఘాలు, ఇప్పుడు వారికే సమస్యల మూలంగా మారినట్టు కనిపిస్తోంది.
ఇటీవల, తెలుగు సంఘాలతో సంబంధాలు కలిగి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో, సుమారు 200 మంది తెలుగు ఉద్యోగులను ఒక ప్రముఖ సంస్థ ఉద్యోగాల నుండి తొలగించిన సంగతి కలకలం రేపుతోంది.
ఈ ఘటన అమెరికాలోనే కాక, అంతర్జాతీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే ట్రంప్ ప్రభుత్వం వలసదారులపై కఠిన నిర్ణయాలు తీసుకుంటూ వీసాల ఆంక్షలు పెంచుతున్న తరుణంలో, ఇలాంటి అంశాలు భారతీయ ఉద్యోగులకు మరింత ఇబ్బందులు కలిగిస్తున్నాయి.
వివరాలు
200 మంది తెలుగు ఉద్యోగులు తొలగింపు
'ఫానీ మే' అనే అమెరికన్ కంపెనీలో పనిచేస్తున్న కొంతమంది భారతీయులు, అందులో ప్రత్యేకంగా తెలుగువారు, అక్కడి తెలుగు సంఘంతో కలిసి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
ఈ ఆరోపణల నేపథ్యంలో సంస్థ, నైతిక కారణాలపై చర్యలు తీసుకుంటూ 200 మంది తెలుగు ఉద్యోగుల్ని పదవీ నుంచి తొలగించినట్టు సమాచారం.
అమెరికా ప్రభుత్వ 'మ్యాచింగ్ గ్రాంట్స్' కార్యక్రమాన్ని వక్రీకరించి, ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారని సంస్థ అధికారులు తేల్చినట్టు వార్తలొచ్చాయి.
ఇలాంటి అనేక దుర్వినియోగ ఉదాహరణల్లో భాగంగా,ఈ ఏడాది ఆరంభంలో క్యూపర్టినోలోని ఉద్యోగులు కూడా ఇలానే తొలగించబడ్డారు.
అదే తరహాలో, ప్రముఖ టెక్ సంస్థ ఆపిల్ కూడా తన సంస్థలో పనిచేస్తున్న 100 మంది ఉద్యోగులను ఈ కారణాలతో తొలగించినట్టు తెలుస్తోంది.
వివరాలు
700 మంది ఉద్యోగులపై ప్రభావం
తాజా కేసులో ఫానీ మే సంస్థలో మరోసారి ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడంతో మొత్తం 700 మంది ఉద్యోగులపై ప్రభావం పడింది. ఇందులో 200 మంది తెలుగు వ్యక్తులే ఉండటం విశేషం.
ఈ నేపథ్యంలో అమెరికాలో తెలుగు సంఘాల ప్రాముఖ్యత, వారి నడవడి పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రత్యేకించి, ఈ సంఘాలు నిర్వహించే కార్యక్రమాలకు అమెరికా సంస్థలు 'మ్యాచింగ్ ఫండ్స్' అందించే సందర్భంలో అవినీతి చోటుచేసుకున్నట్టు ఆరోపణలు రావడంతో, తెలుగు ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయే పరిస్థితి ఎదుర్కొంటున్నారు.
వివరాలు
గ్రీన్ కార్డుల పరంగా కఠిన నిబంధనలు
ఇప్పటికే ట్రంప్ ప్రభుత్వ పాలనలో వలసదారులపై ఆంక్షలు మరింతగా పెరిగాయి.
కొత్త వీసాల మంజూరు, గ్రీన్ కార్డుల పరంగా కఠిన నిబంధనలు అమలవుతున్నాయి.
అంతేకాక, భారతీయ విద్యార్థులు గతంలో చేసుకునే పార్ట్ టైమ్ ఉద్యోగాలపైనా ఆంక్షలు పడిన పరిస్థితి.
అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో, అమెరికాలో అన్ని అర్హతలు కలిగి ఉద్యోగం పొందిన వారు కూడా ఇలాంటి స్కాంలలో ఇరుక్కొని ఉద్యోగాలు కోల్పోతుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.