ఇజ్రాయెల్- హమాస్ యుద్ధానికి.. అమెరికా-ఇరాన్ 6 బిలియన్ డాలర్ల ఒప్పందానికి లింకేంటి?
ఇజ్రాయెల్‌పై పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ దాడి పశ్చిమాసియాలో మరోసారి యుద్ధకాంక్షను రగిల్చింది. ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్ల దాడిని ఇరాన్ సమర్ధించింది. ఇజ్రాయెల్‌పై దాడి వెనుక ఇరాన్‌తో పాటు, ఆ దేశ మిలిటెంట్ సంస్థల హస్తం ఉందంటూ అంతర్జాతీయ మీడియా కూడా కోడై కూస్తోంది. ఇరాన్ ప్రోత్సాహంతోనే ఈ హమాస్ రెచ్చిపోతున్నట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చిన 6 బిలియన్ డాలర్ల నిధులతోనే ఇజ్రాయెల్‌పై దాడికి హమాస్‌ను ఇరాన్ ప్రోత్సహించినట్లు ట్రంప్ ఆరోపించారు. ఇరాన్-అమెరికా మధ్య కుదిరిన 6బిలియన్ డాలర్ల నిధుల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదని యూఎస్ విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ అన్నారు.
ఇరాన్-అమెరికా మధ్య ఖైదీల మార్పిడి ఒప్పందం
2019లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ఇరాన్ చమురు ఎగుమతులు, బ్యాంకింగ్ రంగంపై ఆంక్షలు విధించారు. దీని వల్ల ఇరాన్ చమురు ఆదాయాలు దక్షిణ కొరియా బ్యాంకుల్లో 6 బిలియన్ల డాలర్లు చిక్కుకుపోయాయి. ఈ 6బిలియన్ డాలర్ల కోసం ఈ ఏడాది ఆగస్టులో అమెరికా- ఇరాన్ మధ్య కీలక ఒప్పందం జరిగింది. 6 బిలియన్ల డాలర్లను విడుదల చేసేందుకు ఇరాన్ బంధించిన ఐదుగురు యూఎస్ పౌరులను విడిచిపెట్టాలని అమెరికా డిమాండ్ చేసింది. అదే సమయంలో ఇరాన్ కూడా తమ ఐదుగురు పౌరులను విడిచిపెట్టాలని షరుతు విధించింది. దీనికి ఇరు దేశాలు అంగీకారం తెలిపాయి.
ఇప్పుడు 6 బిలియన్ డాలర్ల ఎక్కడ ఉన్నాయి?
వాస్తవానికి స్తంభించిపోయిన 6 బిలియన్ డాలర్ల నిధులు ఇంకా ఇరాన్‌కు చేరుకోలేదు. ఇప్పటికీ దోహాలో ఉన్న నిధులను ఖతార్ సెంట్రల్ బ్యాంక్ పర్యవేక్షిస్తోంది. ఈ 6 బిలియన్ డాలర్లలో అమెరికా పన్ను చెల్లింపుదారుల సొమ్ము లేదని యూఎస్ విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ అన్నారు. ఆ సొమ్మంతా ఇరాన్‌దే అని చెప్పుకొచ్చారు. ఈ డబ్బును ఇరాన్ వెలుపల దిగుమతుల కోసం ఆహారం, ఇతర వస్తువులను కొనుగోలు చేయడంతో సహా మానవతా-సంబంధిత ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించాలని ఇరాన్‌తో అమెరికా ఒప్పందం చేసుకుంది. ఆ డబ్బంతా బ్యాంకులో ఉందని యూఎస్ ట్రెజరీ అండర్ సెక్రటరీ బ్రియాన్ నెల్సన్ పేర్కొన్నారు. అందులో ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదన్నారు.