Chile Wildfires: చిలీ అడవుల్లో కాల్చిచ్చు.. 46 మంది మృతి
చిలీ అడవుల్లో కార్చిచ్చు చెలరేగింది. ఈ ప్రమాదంలో 46 మంది చనిపోయినట్లు చిలీ అధ్యక్షుడు ధృవీకరించారు. కార్చిచ్చు నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అడవిలో మంటలు మరింత వ్యాపిస్తుండటంతో చిలీ ప్రభుత్వం దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. చిలీ అంతర్గత మంత్రి కరోలినా తోహా మాట్లాడుతూ.. దేశంలోని మధ్య, దక్షిణ భాగంలో ప్రస్తుతం 92 అడవులు అగ్నికి ఆహుతయ్యాయన్నారు. సెంట్రల్ వాల్పరైసో ప్రాంతంలో చెలరేగుతున్న తీవ్రమైన కార్చిచ్చు వల్ల 46 మంది మరణించారని చిలీ అధ్యక్షుడు చెప్పారు.
1,100 ఇళ్లు దగ్ధం
జనసాంద్రత ఉన్న ప్రాంతంలోకి మంటలు వ్యాపించడంతో దాదాపు 1,100 ఇళ్లు కాలి బూడిదయ్యాయి. వల్పరైసో ప్రాంతంలో అత్యంత ఘోరమైన అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రాంతంలోకి భారీగా అగ్నిమాపక యంత్రాలు, అంబులెన్స్‌లను తరలిస్తున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు కోరారు. వల్పరైసో ప్రాంతంలో మూడు షెల్టర్ క్యాంపులను ఏర్పాటు చేశారు. కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాలను చేరుకోవడానికి రెస్క్యూ బృందాలు చాలా కష్టపడుతున్నాయి. మంటలను అదుపు చేసేందుకు 19 హెలికాప్టర్లు, 450కి పైగా అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దింపినట్లు చిలీ అంతర్గత మంత్రి తెలిపారు.