'హష్ మనీ' కేసులో ట్రంప్‌ను అరెస్టు చేస్తారా? తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోండి
'హష్ మనీ' కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఉచ్చు బిగుస్తోంది. వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న ట్రంప్ అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఓ పోర్న్ స్టార్‌కు డబ్బులు చెల్లింపులపై మాన్‌హాటన్ గ్రాండ్ జ్యూరీ విచారణ చేపట్టింది. ఈ మేరకు ఆయనపై అభియోగాలు మోపినట్లు ప్రాసిక్యూటర్లు, డిఫెన్స్ లాయర్లు తెలిపారు. ఈ వ్యవహారంతో 'హష్ మనీ' కేసులో క్రిమినల్ విచారణ ఎందుర్కొంటున్న మొదటి అమెరికా మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచిపోయారు. న్యూయార్క్ నగరంలో 'హష్ మనీ' కేసులో ప్రతిరోజూ అనేక మంది అరెస్టు అవుతున్నారు. అయితే వచ్చేవారం అందులో ట్రంప్ కూడా ఉండొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అరెస్టు అయినా అధ్యక్షపదవికి ట్రంప్ పోటీ చేయొచ్చు
న్యూయార్క్ రాష్ట్ర చట్టం ప్రకారం, ప్రచార-ఆర్థిక ఉల్లంఘనలో వ్యాపార రికార్డులను తప్పుదారి పట్టించడం అనేది చాలా తక్కువ స్థాయి నేరం. ఈ నేరానికి నాలుగు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. అమెరికా చట్టం ప్రకారం నేరారోపణ ఉన్నా లేదా జైలులో ఉన్న వ్యక్తి అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయవచ్చు. అంటే 'హష్ మనీ' కేసులో ట్రంప్ అరెస్టు అయినా అతను అధ్యక్షపదవికి పోటీ చేయడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ కేసులో తీవ్రమైన అభియోగాలు ఎదుర్కొంటున్న ట్రంప్ లొంగిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. ట్రంప్ అరెస్టు చేసిన తర్వాత ప్రోటోకాల్‌లో భాగంగా వేలిముద్రలు, మగ్ షాట్‌ను తీసుకుంటారు. అరెస్టుకు సంబంధించిన అన్ని ప్రక్రియలు పూర్తికావడానికి చాలా గంటల సమయం పడుతుంది.