World Bank: శ్రీలంక,వియత్నాంకు వరల్డ్ బ్యాంక్ ప్రమోషన్.. భారత్ పరిస్థితి ఏంటి?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ బ్యాంకు తాజా దేశాల ఆదాయ వర్గీకరణలో శ్రీలంక,వియత్నాం,ఫిలిప్పీన్స్‌కు ఎగువ మధ్య ఆదాయ (Upper Middle Income) దేశాల హోదా లభించింది. దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధి,ఆర్థిక వ్యవస్థ కోలుకోవడాన్ని గుర్తిస్తూ ఈ మూడు దేశాలను ఉన్నత వర్గంలోకి చేర్చినట్లు ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది. తీవ్ర ఆర్థిక సంక్షోభం నుంచి కోలుకున్న శ్రీలంక మరోసారి ఎగువ మధ్య ఆదాయ దేశాల జాబితాలో చేరింది. 2022లో తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో దేశం దివాలా అంచులకు చేరుకున్నప్పటికీ,కేవలం మూడేళ్లలోనే గణనీయమైన పురోగతి సాధించిందని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. 2025లో దేశ వాస్తవ స్థూల దేశీయోత్పత్తి (GDP) 5శాతం వృద్ధి నమోదు చేసిందని తెలిపింది. పారిశ్రామిక రంగం పుంజుకోవడం,ఆర్థిక సేవలు,పర్యాటక రంగాల వృద్ధి ఇందుకు ప్రధాన కారణాలుగా వివరించింది.
వివరాలు
గువ మధ్య ఆదాయ దేశాల వర్గంలోకి వియత్నాం, ఫిలిప్పీన్స్
అయితే ఈ హోదాను శ్రీలంక చాలా స్వల్ప తేడాతోనే సాధించిందని ప్రపంచ బ్యాంక్ స్పష్టం చేసింది. ఈ హోదా శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నదానికి నిదర్శనమని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. శ్రీలంక తొలిసారిగా 2019లో ఎగువ మధ్య ఆదాయ దేశంగా గుర్తింపు పొందింది. అనంతరం ఆర్థిక వృద్ధి మందగించడం, ఆదాయ స్థాయిలు తగ్గడం, అంతర్గత, బాహ్య ఆర్థిక ఒత్తిళ్లు పెరగడంతో మళ్లీ దిగువ మధ్య ఆదాయ దేశాల జాబితాలోకి పడిపోయింది. వియత్నాం, ఫిలిప్పీన్స్ కూడా బలమైన ఆర్థిక వృద్ధి కారణంగా ఎగువ మధ్య ఆదాయ దేశాల వర్గంలోకి చేరాయి. ఈ మార్పు వల్ల విదేశీ పెట్టుబడిదారుల విశ్వాసం మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
వివరాలు
వియత్నాం 2009 నుంచి దిగువ మధ్య ఆదాయ దేశం
వియత్నాం 2009 నుంచి దిగువ మధ్య ఆదాయ దేశంగా ఉండగా,ఫిలిప్పీన్స్ దశాబ్దాలుగా అదే వర్గంలో కొనసాగుతోంది. ప్రపంచ బ్యాంక్ తాజా వర్గీకరణ ప్రకారం ఆగ్నేయాసియాలోని ఐదు ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్‌తో పాటు ఇప్పుడు వియత్నాం, ఫిలిప్పీన్స్ కూడా ఎగువ మధ్య ఆదాయ లేదా అంతకంటే ఉన్నత ఆదాయ దేశాల జాబితాలో నిలిచాయి.
వివరాలు
భారత్ పరిస్థితి ఏంటి?
భారత్ మాత్రం ఇప్పటికీ దిగువ మధ్య ఆదాయ (Lower Middle Income) దేశాల వర్గంలోనే కొనసాగుతోంది. 2007 నుంచి ఇదే వర్గంలో ఉంది.ప్రపంచ బ్యాంక్ అంచనాల ప్రకారం భారత తలసరి స్థూల జాతీయ ఆదాయం (GNI Per Capita) సుమారు 2,500 నుంచి 2,700 డాలర్ల మధ్య ఉంది. ఇది ఎగువ మధ్య ఆదాయ దేశాల కనీస పరిమితి అయిన 4,496 డాలర్ల కంటే చాలా తక్కువ. ప్రపంచ బ్యాంక్ నిబంధనల ప్రకారం తలసరి స్థూల జాతీయ ఆదాయం 1,136 నుంచి 4,495 డాలర్ల మధ్య ఉంటే ఆ దేశాన్ని దిగువ మధ్య ఆదాయ దేశంగా పరిగణిస్తారు. 4,496 నుంచి 13,935 డాలర్ల మధ్య ఉంటే ఎగువ మధ్య ఆదాయ దేశంగా వర్గీకరిస్తారు.
వివరాలు
ప్రపంచ బ్యాంక్ దేశాలను ఎలా వర్గీకరిస్తుంది?
ప్రపంచ బ్యాంక్ దేశాలను నాలుగు ఆదాయ వర్గాలుగా విభజిస్తుంది. అవి అధిక ఆదాయ (High Income),ఎగువ మధ్య ఆదాయ (Upper Middle Income),దిగువ మధ్య ఆదాయ (Lower Middle Income), అల్ప ఆదాయ (Low Income) దేశాలు. ఈ వర్గీకరణ గత క్యాలెండర్ సంవత్సరానికి సంబంధించిన తలసరి స్థూల జాతీయ ఆదాయం (GNI Per Capita) ఆధారంగా రూపొందించబడుతుంది.
వివరాలు
ప్రపంచ బ్యాంక్ దేశాలను ఎలా వర్గీకరిస్తుంది?
తాజా అంచనాల్లో మొత్తం 218 దేశాలను పరిశీలించారు. ఈ వర్గీకరణ 2027 జూన్ చివరి వరకు ప్రపంచ ప్రమాణంగా అమల్లో ఉంటుంది. స్థూల జాతీయ ఆదాయం (GNI) అంటే ఒక దేశ పౌరులు, వ్యాపార సంస్థలు ప్రపంచంలో ఎక్కడి నుంచి సంపాదించినా మొత్తం ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఇక స్థూల దేశీయోత్పత్తి (GDP) మాత్రం ఆయా దేశ సరిహద్దుల్లో ఉత్పత్తి చేసిన వస్తువులు, సేవల మొత్తం విలువను మాత్రమే సూచిస్తుంది.