LOADING...
Trump: మొజ్తబా ఖమేనీతో సమావేశానికి ఆసక్తి చూపిన ట్రంప్
మొజ్తబా ఖమేనీతో సమావేశానికి ఆసక్తి చూపిన ట్రంప్

Trump: మొజ్తబా ఖమేనీతో సమావేశానికి ఆసక్తి చూపిన ట్రంప్

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 03, 2026
05:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీతో భేటీ అయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. పరిస్థితులు అనుకూలిస్తే భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో మొజ్తబాను కలిసే అవకాశం ఉందని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ తెలిపారు. కాగా, గత ఫిబ్రవరిలో అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ దేశ అత్యున్నత పదవిని చేపట్టారు. అయితే బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన బహిరంగంగా కనిపించకపోవడంతో పలు ఊహాగానాలు వెలువడ్డాయి.

వివరాలు 

మొజ్తబా ఖమేనీ సజీవంగానే ఉన్నారు: మార్కో రూబియో

ఆయన ఆరోగ్య పరిస్థితి, పరిపాలనా సామర్థ్యంపై కూడా అనేక ప్రశ్నలు తలెత్తాయి. దాడుల్లో మొజ్తబా తీవ్రంగా గాయపడ్డారని కూడా అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మొజ్తబా ఖమేనీ సజీవంగానే ఉన్నారని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తాజాగా స్పష్టం చేశారు. ఆయన ప్రత్యక్షంగా ప్రజల్లో కనిపించకపోయినా, మధ్యవర్తులు, రాతపూర్వక ఆదేశాల ద్వారా పాలనా వ్యవహారాల్లో పాల్గొంటున్నారని తెలిపారు. రూబియో చేసిన వ్యాఖ్యలను ట్రంప్ కూడా సమర్థించారు. దేశ పరిపాలనకు సంబంధించిన కీలక నిర్ణయాలకు మొజ్తబా ఆమోదం తెలుపుతున్నారని ఆయన చెప్పారు. ఇదే సమయంలో అమెరికా-ఇరాన్ మధ్య సంబంధాలు క్రమంగా మెరుగుపడుతున్నాయనే ఆశాభావాన్ని ట్రంప్ వ్యక్తం చేశారు.

Advertisement