Tampa: 107 ఏళ్ల తర్వాత సముద్ర గర్భంలో బయటపడిన తొలి ప్రపంచ యుద్ధ నౌక శిథిలాలు
ఈ వార్తాకథనం ఏంటి
మొదటి ప్రపంచ యుద్ధ కాలానికి చెందిన ఒక యుద్ధ నౌక శిథిలాలు 107 ఏళ్ల తర్వాత వెలుగులోకి వచ్చాయి. బ్రిటన్‌లోని కార్న్‌వాల్ తీరానికి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో, అట్లాంటిక్ సముద్రం అడుగున 300 అడుగుల లోతులో బ్రిటిష్ గజ ఈతగాళ్లు ఈ అవశేషాలను గుర్తించారు. ఈ నౌక చరిత్రలోకి వెళ్లితే.. 1918 సెప్టెంబరు 17న తొలి ప్రపంచ యుద్ధం ఉద్ధృతంగా కొనసాగుతున్న సమయంలో, అమెరికా తీర రక్షక దళానికి చెందిన 'తాంపా' నౌక అట్లాంటిక్ సముద్రంలో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ప్రయాణం కొనసాగుతున్న కొద్దీ నౌక బాయిలర్లకు అవసరమైన బొగ్గు సెప్టెంబరు 26 నాటికి పూర్తిగా తక్కువవుతుందని స్పష్టమైంది.
వివరాలు
టార్పెడోను ప్రయోగించిన జలాంతర్గామి కెప్టెన్
దాంతో బొగ్గును తిరిగి నింపుకోవడానికి నౌకను కాన్వాయ్ నుంచి విడదీసి, వేల్స్‌లోని ఒక రేవు వైపు మళ్లించేందుకు కెప్టెన్ ఉన్నతాధికారులను సంప్రదించారు. వారి అనుమతి లభించడంతో నౌకను వేగంగా ఆ దిశగా నడిపించారు. అయితే అదే రోజు రాత్రి 8.15 గంటల సమయంలో జర్మనీకి చెందిన జలాంతర్గామి యూబీ-41 ఈ నౌకను గమనించింది. వెంటనే జలాంతర్గామి కెప్టెన్ టార్పెడోను ప్రయోగించాడు. భారీ పేలుడు సంభవించగా, నౌకలోని బొగ్గు ధూళి కూడా అంటుకుని అగ్నికి ఆహుతైంది.
వివరాలు
ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికాకు జరిగిన అతిపెద్ద నౌకాదళ నష్టం
దీంతో నౌక పూర్తిగా మునిగిపోయింది. ఈ ఘటనలో నౌకలో ఉన్న 131 మంది సైనికులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. తొలి ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికాకు జరిగిన అతిపెద్ద నౌకాదళ నష్టంగా ఇది నమోదైంది. ఈ నౌక శిథిలాల కోసం అన్వేషణ బృందాలు ఎన్నో సంవత్సరాలుగా శోధనలు కొనసాగిస్తున్నాయి. చివరకు ఆ కృషికి ఫలితం దక్కిందని గజ ఈతగాళ్ల బృంద నాయకుడు స్టీవ్ మోరిటైమర్ సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు.