greenland: గ్రీన్‌లాండ్‌లో భూమి కొనాలంటే సాధ్యం కాదు.. ఇల్లు కావాలంటే పదేళ్లు వేచి చూడాలి!
ఈ వార్తాకథనం ఏంటి
"గ్రీన్‌లాండ్ అమ్మకానికి లేదు" అనే నినాదం ఇప్పుడు ఆ ఐలాండ్‌లో మార్మోగిపోతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌లాండ్‌ను తమ దేశంలో భాగం చేసుకోవాలని సూచించడం, సోషల్ మీడియా లో గ్రీన్‌లాండ్ ను అమెరికాలో చూపించే మ్యాప్‌ను పంచుకోవడం, అలాగే ఆ దీవిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం, అక్కడి ప్రజలు, రాజకీయ నేతలలో తీవ్ర అసహనాన్ని సృష్టించాయి. దీంతో 'మా ఐలాండ్ అమ్మకానికి లేదు' అంటూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రీన్‌లాండ్ భూయాజమాన్య చట్టాలు మరింత ఆసక్తికరంగా మారాయి.
వివరాలు
భూమి.. సామూహిక వనరు
గ్రీన్‌లాండ్ డెన్మార్క్‌లో స్వయం ప్రతిపత్తి గల ప్రాంతం. ఇక్కడ భూమి వ్యక్తిగత యాజమాన్యం కింద కాదు; అది ప్రజల సామూహిక వనరు. అందువల్ల వ్యక్తిగతంగా ఎవరికి భూమి కొరకు హక్కులు ఉండవు. భూమి ప్రభుత్వ సంస్థలు, మున్సిపాలిటీల ద్వారా ప్రజల తరఫున నిర్వహించబడుతుంది. గ్రీన్‌లాండ్ పౌరులైనా భూమిని కొనలేరు. నివాసానికి ఇల్లు కావాలనుకుంటే, వ్యాపారం చేయాలనుకుంటే, ఇంటిని పెంచాలంటే లేదా కారు పార్కింగ్ కోసం స్థలం కావాలంటే, అన్ని ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలి. అక్రమంగా నిర్మాణాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారు.
వివరాలు
ఇల్లు ఎవరు కొనొచ్చు?
స్థానిక ప్రజలు, డెన్మార్క్, ఫారో దీవుల పౌరులకు ఇక్కడ ఇల్లు కొనుగోలు హక్కు ఉంది. ఇతర దేశాల వారు కనీసం రెండు సంవత్సరాలు గ్రీన్‌లాండ్‌లో నివసించి, అన్ని పన్నులు చెల్లించినవారే ఇల్లు కోసం దరఖాస్తు చేయవచ్చు. ముఖ్య పట్టణాల్లో, ముఖ్యంగా రాజధాని నూక్‌లో ఇళ్ల కొరత ఎక్కువ. కాబట్టి, హౌసింగ్ మార్కెట్‌లో డిమాండ్ చాలా ఎక్కువ. ప్రభుత్వం ఒక దరఖాస్తుదారుడికి ఇల్లు కేటాయించడానికి 10-12 సంవత్సరాలు పట్టవచ్చు. మరి అప్పటి వరకు ఎలా? సాధారణ ప్రజలు అద్దె ఇళ్లలో ఉంటారు. కంపెనీలు తమ సిబ్బందికి నివాసం ఏర్పాటు చేస్తాయి. ప్రభుత్వ, స్థానిక మున్సిపాలిటీ ఉద్యోగులకు ప్రభుత్వం అద్దె ఇళ్లను కేటాయిస్తుంది. సొంత ఇల్లు కావాలంటే ప్రభుత్వం దగ్గర దరఖాస్తు చేయాలి.
వివరాలు
ఎలా కేటాయిస్తారు?
కంపెనీలు, వ్యక్తులు దరఖాస్తులు ప్రభుత్వ కార్యాలయాల ద్వారా లేదా ఆన్‌లైన్ ద్వారా సమర్పించాలి. అధికారులు వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. కంపెనీల దరఖాస్తులు గ్రీన్‌లాండ్ అభివృద్ధికి ఎంత ఉపయోగకరమో చూస్తారు. వ్యక్తుల దరఖాస్తులు ప్రభుత్వం నిర్ణయించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే, ఇల్లు కేటాయిస్తారు. ఒకసారి ఇల్లు కేటాయించబడిన తర్వాత, దానిని ఇతరులకు విక్రయించడం సాధ్యం కాదు; యాజమాన్య హక్కులు బదిలీ చేయాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి.
వివరాలు
అంతర్జాతీయ ఆసక్తి
ట్రంప్ వ్యాఖ్యలతో గ్రీన్‌లాండ్ పై అంతర్జాతీయ వ్యాపారుల దృష్టి పడింది. అక్కడి ఆర్థిక వ్యవస్థలో భాగమయ్యేలా కంపెనీలు ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్రీన్‌లాండ్ ట్రంప్ చేత స్వాధీనం అయ్యే పరిస్థితి వస్తే, భూచట్టాలలో మార్పులు జరగొచ్చని ఆందోళన ఉంది. అందుకే, స్థానిక ప్రజలు, రాజకీయ నాయకులు ఈ ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.