Loading...
Muhammad Yunus: బంగ్లాదేశ్‌లో మరోసారి హింస.. యూనుస్ పూర్వీకుల ఇంటికి నిప్పు
బంగ్లాదేశ్‌లో మరోసారి హింస.. యూనుస్ పూర్వీకుల ఇంటికి నిప్పు

Muhammad Yunus: బంగ్లాదేశ్‌లో మరోసారి హింస.. యూనుస్ పూర్వీకుల ఇంటికి నిప్పు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 19, 2026
08:32 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్‌లో మరోసారి రాజకీయ హింస తీవ్రరూపం దాల్చింది. మాజీ ప్రధాని షేక్ హసీనా స్వదేశానికి తిరిగి వస్తానని ప్రకటించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజధాని ఢాకాతో పాటు పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఆందోళనకారులు వాహనాలు, భవనాలకు నిప్పంటించారు. చటోగ్రామ్‌లో తాత్కాలిక ప్రభుత్వ మాజీ అధిపతి మహమ్మద్ యూనుస్ పూర్వీకుల ఇంటికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. గత రెండు రోజులుగా సిల్హెట్, రాజ్‌షాహి, బరిసాల్, ఫరీద్‌పూర్ ప్రాంతాల్లో యూనుస్‌కు చెందిన గ్రామీణ బ్యాంకు శాఖలపై కూడా దాడులు జరిగాయి. మరోవైపు ఢాకాలో అవామీ లీగ్‌కు చెందిన ఇద్దరు నేతల ఇళ్లపై బీఎన్‌పీ కార్యకర్తలు దాడి చేసి తగులబెట్టినట్లు స్థానిక పత్రికలు వెల్లడించాయి.

వివరాలు 

హింసాత్మక ఘటనల్లో నలుగురికి గాయాలు 

బంగ్లాదేశ్‌లోని మొత్తం 64 పరిపాలనా జిల్లాల్లో 28 జిల్లాల్లో డజన్ల కొద్దీ దేశీయంగా తయారు చేసిన బాంబులు పేలాయి.

ఢాకాలో జరిగిన హింసాత్మక ఘటనల్లో నలుగురు గాయపడ్డారు. నరైల్ జిల్లాలో బీఎన్‌పీ నిర్వహించిన ర్యాలీపై అవామీ లీగ్ కార్యకర్తలు దాడి చేశారు.

ఈ ఘటనలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు స్థానిక నేతలు ప్రాణాలు కోల్పోయారు.

ఫరీద్‌పూర్, పిరోజ్‌పూర్ ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఒక బీఎన్‌పీ నేత, ఓ రవాణా కార్మికుడు మరణించారు.

వివరాలు 

షేక్ హసీనాకు మరణశిక్ష

షేక్ హసీనాకు గతేడాది ప్రత్యేక ట్రిబ్యునల్ మరణశిక్ష విధించింది.

ఈ తీర్పు వెలువడి ఏడాది పూర్తయిన సందర్భంగా అవామీ లీగ్ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చింది.

2024 ఆగస్టు 5న విద్యార్థుల ఆందోళనలు, జులై తిరుగుబాటు నేపథ్యంలో హసీనా అధికారాన్ని కోల్పోయారు.

అప్పటి నుంచి ఆమె భారత్‌లోనే ఉంటున్నారు. అయితే, ఈ నెల ప్రారంభంలో ఆమె కీలక ప్రకటన చేశారు.

తనకు మరణశిక్ష విధించినప్పటికీ, డిసెంబర్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తానని స్పష్టం చేశారు. ఈ ప్రకటన తర్వాత దేశంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.

ADVERTISEMENT

వివరాలు 

తుంగిపారాలో ఉద్రిక్త పరిస్థితులు

హసీనా స్వస్థలమైన తుంగిపారాలో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సుమారు 30 మంది అనుమానిత హసీనా మద్దతుదారులను పోలీసులు అరెస్టు చేయడంతో వందలాది మంది ఆందోళనకారులు పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టారు.

పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉండటంతో పోలీసులు స్టేషన్‌ను ఖాళీ చేయాల్సి వచ్చింది. మరోవైపు ప్రధాని తారిఖ్ రెహమాన్ అవామీ లీగ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఆ పార్టీని ఉగ్రవాద సంస్థగా, ఓడిపోయిన ఫాసిస్ట్ శక్తిగా అభివర్ణించారు. ప్రజాస్వామ్యాన్ని కోరుకునే శక్తులన్నీ ఒక్కటై, 2024 ఉద్యమ స్ఫూర్తితో ఆ శక్తులను ఓడించాలని పిలుపునిచ్చారు.

ADVERTISEMENT

వివరాలు 

భద్రతను కట్టుదిట్టం చేసిన ప్రభుత్వం 

హింసాత్మక ఘటనలు మరింత విస్తరించకుండా ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది.

హసీనా జన్మస్థలమైన గోపాల్‌గంజ్‌తో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో వేలాది మంది బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ) సిబ్బందిని మోహరించారు.

మరోవైపు కేవలం 24 గంటల్లో ఢాకాలోనే పోలీసులు 565 మందిని అరెస్టు చేశారు.

అరెస్టయిన వారిలో హసీనా ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన నురుల్ ఇస్లాం నాహిద్ కూడా ఉన్నారు.

అల్లర్లకు సంబంధించిన ఆడియో, వీడియో ఆధారాలను పరిశీలించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి సలాహుద్దీన్ అహ్మద్ ప్రకటించారు.

వివరాలు 

అవామీ లీగ్‌పై నిషేధం

2024లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత మహమ్మద్ యూనుస్ నేతృత్వంలోని పాలనలో అవామీ లీగ్‌పై నిషేధం విధించారు.

ఇదే సమయంలో బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ నివాసంతో పాటు 1971 విముక్తి పోరాటానికి సంబంధించిన పలు స్మారకాలను కూడా ఆందోళనకారులు ధ్వంసం చేశారు.

తాజాగా మరోసారి దేశవ్యాప్తంగా హింస చెలరేగడం బంగ్లాదేశ్ రాజకీయ పరిస్థితులపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

యూనుస్ పూర్వీకుల ఇంటికి నిప్పు

ADVERTISEMENT