LOADING...
Zelenskyy: ట్రంప్‌ శాంతి ప్రణాళిక సవరణలపై జెలెన్‌స్కీ సానుకూల స్పందన
ట్రంప్‌ శాంతి ప్రణాళిక సవరణలపై జెలెన్‌స్కీ సానుకూల స్పందన

Zelenskyy: ట్రంప్‌ శాంతి ప్రణాళిక సవరణలపై జెలెన్‌స్కీ సానుకూల స్పందన

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 02, 2025
08:12 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిపాదించిన రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ విరమణ శాంతి ప్రణాళికలో చేపట్టిన సవరణలపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ సానుకూల స్పందన వ్యక్తం చేశారు. మార్పుల అనంతరం ప్రణాళిక మెరుగ్గా ఉందన్నారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యువెల్‌ మేక్రాన్‌తో సోమవారం నిర్వహించిన భేటీ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో అమెరికా ముందుకు తెచ్చిన ప్రణాళికలో పలు అంశాలు రష్యాకు అనుకూలంగా ఉన్నాయని కీవ్‌తో పాటు నాటో దేశాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఆ నేపథ్యంలో కొంతమంది దేశాలు సవరణలు సూచించగా, వాటిని చేర్చిన అనంతరం ప్రణాళిక మరింత బాగుందని జెలెన్‌స్కీ తెలిపారు. యుద్ధం ముగింపునకు సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయన్నారు

వివరాలు 

దేశానికి గట్టి భద్రతా హామీలు పొందడమే తమ అగ్ర ప్రాధాన్యత

పశ్చిమాసియాలోని అమెరికా రాయబారి స్టీవ్‌ విట్‌కాఫ్‌ ఈ రోజున రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో సమావేశం జరపనుండగా, ఈ నేపథ్యంలో జెలెన్‌స్కీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. చర్చల ప్రధాన లక్ష్యంగా ఉక్రెయిన్‌ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం, దేశానికి గట్టి భద్రతా హామీలు పొందడమే తమ అగ్ర ప్రాధాన్యతలని ఆయన స్పష్టం చేశారు. చర్చలు నిర్మాణాత్మకంగా సాగుతున్నప్పటికీ, ఇంకా పరిష్కరించాల్సిన క్లిష్టమైన సమస్యలు కొన్ని మిగిలి ఉన్నాయని కూడా తెలిపారు. ఇదిలా ఉండగా, దొనెట్స్క్‌ ప్రాంతంలోని ఒక కీలక ప్రాంతాన్ని తమ సైన్యం ఆక్రమించుకుందని రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్‌ ప్రకటించింది.

వివరాలు 

 శాంతి చర్చలు ఇప్పటికీ ప్రాథమిక దశలోనే ఉన్నాయి

అయితే దీనిని జెలెన్‌స్కీ తీవ్రంగా ఖండిస్తూ, అక్కడ ఉన్న రష్యా దళాలను తమ ఉక్రెయిన్‌ సైన్యం వెనక్కు తరిమికొట్టిందని వెల్లడించారు. మరోవైపు, మేక్రాన్‌ మాట్లాడుతూ, ప్రస్తుత శాంతి చర్చలు ఇప్పటికీ ప్రాథమిక దశలోనే ఉన్నాయని అభిప్రాయపడ్డారు. కాల్పుల విరమణ అమల్లో ఉన్న సమయంలో కీవ్‌కు పటిష్టమైన భద్రతా హామీలు అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉక్రెయిన్‌-అమెరికా అధికారుల మధ్య శాంతి ప్రణాళికపై కీలక సమావేశం జరిగింది. అనంతరం జెలెన్‌స్కీ పారిస్‌ పర్యటనకు వెళ్లారు. ఈ భేటీలు సానుకూల ఫలితాలకే దారి తీసాయంటూ వైట్‌హౌస్‌ కూడా అధికారికంగా ధ్రువీకరించింది.

Advertisement