Cars Recall : 34 లక్షల హ్యుందాయ్, కియా కార్లలో ప్రాబ్లమ్.. వచ్చి మర్చుకోండి!
దక్షిణాకొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థలు హ్యుందాయ్, కియా భారీ సంఖ్యలో కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించాయి. అమెరికాలో దాదాపు 34 లక్షల హ్యుందాయ్, కియా కార్లలో లోపాలు ఉన్నట్లు గుర్తించారు. ఇంజిన్ కంపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగే ప్రమాదం ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయా కార్లను రీకాల్ చేస్తున్న ఆ సంస్థలు ప్రకటించాయి. ఇక ఈ లోపాలను సవరించే వరకు కార్లను బయటే పార్క్ చేసి ఉంచాలని వినియోగదారులను కోరాయి. కార్లలో యాంటీ-లాక్ బ్రేక్ కంట్రోల్ మాడ్యూల్ ఫ్లూయిడ్‌ను లీక్ చేయడం వల్ల ఎలక్ట్రికల్ షార్ట్ కు కారణమవుతోంది. దీంతో వాహనాలను నడుపుతున్నప్పుడు, పార్క్ చేసినప్పుడు మంటలు చెలరేగవచ్చని యుఎస్ సేప్టీ రెగ్యులేటర్లు తెలిపారు.
2010 నుంచి 2019 మధ్య తయారైన మోడల్ కార్లలో లోపాలు
హ్యుందాయ్ శాంటా ఎఫ్ఈ ఎస్‌యూవీ, కియా సోరెంటో ఎస్‌యూవీ సహా 2010 నుంచి 2019 మధ్య తయారైన వివిధ మోడల్ కార్లలో లోపాలను కంపెనీలు గుర్తించాయి. ఎలాంటి ఖర్చు లేకుండా డీలర్లు అయా కార్లలో యాంటీ-లాక్ బ్రేక్ ఫ్యూజ్‌ను రిప్లేస్ చేయనున్నారు. నవంబర్ 14 నుంచి వాహన యజమానులకు దీనిపై మీసేజ్ పంపుతామని కియా తెలిపింది. నవంబర్ 21 నుంచి హ్యుందాయ్ ఈ ప్రక్రియను ప్రారంభించనుంది. ఇప్పటికే 21 హ్యుందాయ్ కార్లలో అగ్నిప్రమాద ఘటనలను గుర్తించారు. కియాలో 10 ఘటనల్లో మంటలంటుకున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదాల్లో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొన్నారు. కస్లమర్ల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ రీకాల్ చేస్తున్నట్లు ఆ సంస్థలు ప్రకటించాయి.