Electric vehicle: వీల్ చైర్‌లోనే కూర్చొని ప్రయాణించే ఎలక్ట్రిక్ వాహనం
తమిళనాడులోని ఐఐటీ మద్రాస్‌కు చెందిన యాలీ మొబిలిటీ సంస్థ వికలాంగుల కోసం ఒక ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ వాహనాన్ని రూపొందించింది. ఈ మూడు చక్రాల ఎలక్ట్రిక్ వాహనాలు అనేక ఆధునిక ఫీచర్లతో రూపొందించారు. దీని ముఖ్యమైన ఫీచర్ ఏమిటంటే, వికలాంగులు వీల్‌చైర్ నుండి బయటకు రాకుండా ఈ ట్రైసైకిల్‌ను నడిపించగలగడం. ఇది వికలాంగులకు తమ ప్రయాణం కోసం ఇతరులపై ఆధారపడకుండా స్వతహాగా ప్రయాణించేందుకు సాయం చేస్తుంది. యాలీ మొబిలిటీ ఈ వాహనానికి ప్రత్యేకమైన రిమోట్‌ను అందించింది. ఇది కార్ల మాదిరిగా పనిచేస్తుంది. ఈ వాహనంలో వెనుక భాగం కొద్దిగా దిగువగా ఉండడంతో, వికలాంగులు వీల్‌చైర్‌తో వాహనంలోకి సులభంగా ఎక్కవచ్చు. ఒకసారి లోపలకి వెళ్ళిన తర్వాత, వీల్‌చైర్ స్వయంచాలకంగా సెట్ అవుతుంది.
ఫుల్ ఛార్జింగ్ 130 కి.మీ ప్రయాణం
ఇవి స్కూటర్ లాగా వాహనాన్ని నడిపించడానికి అనుమతిస్తాయి. దీంతో పాటు వాహనాన్ని సురక్షితంగా ఆపడానికి డిస్క్ బ్రేకులు, ప్రత్యేకమైన హ్యాండ్ బ్రేక్ సిస్టమ్ కూడా అందించారు. తద్వారా వికలాంగులు సురక్షితంగా ప్రయాణించగలుగుతారు. ప్రస్తుతం చాలా మంది వికలాంగులు మూడు చక్రాల వాహనాలను నడుపుతూ కనిపిస్తున్నారు. వాటిలో ఎక్కువ భాగం మోడిఫైడ్ ద్విచక్ర వాహనాలు. అయితే యాలీ మొబిలిటీ తయారుచేసిన ఈ వాహనంలో వ్యక్తిని వీల్‌చైర్‌లోనే కూర్చోబెట్టి నడిపించవచ్చు. ఇది మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే, దీని ఫుల్ ఛార్జింగ్‌తో 130 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణించగలదని అంచనా. గరిష్ట వేగం గంటకు 60 కిలోమీటర్ల కంటే తక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.