Budget 2026: కేంద్ర బడ్జెట్ 2026కి ముందు కీలక డిమాండ్లతో ఎదురు చూస్తున్న ఆటోమొబైల్ రంగం
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర బడ్జెట్ 2026కు ముందుగా ఆటో మొబైల్ పరిశ్రమ కేంద్రానికి కొన్ని ముఖ్యమైన డిమాండ్లను సమర్పించనుంది. ముఖ్యంగా ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వడం, అలాగే దిగుమతి కార్లపై ఉన్న కస్టమ్స్ డ్యూటీలను సవరించడం రంగం వర్గాల ప్రధాన అభ్యర్థనలుగా ఉన్నాయి. ఈ చర్యలు అమలులోకి వచ్చినట్లయితే, వాహన డిమాండ్ పెరుగుతూ, భారత్ ఈవీ రంగంలో వేగంగా అడుగులు వేయగలదని పరిశ్రమలు అభిప్రాయపడుతున్నాయి.
వివరాలు
ఎంట్రీ లెవల్ ఈవీలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు
కాగా, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ శైలేష్ చంద్ర మాట్లాడుతూ.. 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో ఎంట్రీ లెవల్ ఈవీలకు ప్రత్యేక ఇన్సెంటివ్‌లు, అలాగే 'పీఎం ఈ-డ్రైవ్' పథకంలో కమర్షియల్ ఎలక్ట్రిక్ వాహనాలకు మద్దతు కల్పించాలని కోరారు. జీఎస్టీ రేట్ల సవరణలు, రెపో రేట్ తగ్గింపులు, పన్ను విధానాల మార్పులు వలన ప్యాసింజర్ వాహనాల డిమాండ్ పునరుజ్జీవం పొందినప్పటికీ, ఎంట్రీ లెవల్ ఈవీ అమ్మకాలు ఇంకా ఒత్తిడిలోనే కొనసాగుతున్నాయని తెలిపారు. జీఎస్టీ సవరణల కారణంగా పెట్రోల్ కార్ల ధరలు తగ్గడంతో తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్ వాహనాలపై పోటీ పెరుగుతుంది. కేంద్రం తీసుకున్న చర్యలు సానుకూలం, కానీ బడ్జెట్‌లో రెండు అంశాలు తప్పనిసరిగా పరిగణించాలని శైలేష్ చంద్ర పేర్కొన్నారు.
వివరాలు
కమర్షియల్ ఈవీలకు మద్దతు ధర కల్పించడం
కమర్షియల్ వాహనాలు మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాలలో కేవలం 7 శాతం ఉండగా, మొత్తం ప్రయాణ కిలోమీటర్లలో వాటి వాటా 33-35 శాతం అని తెలిపారు. గతంలో ఇవి FAME-2 స్కీమ్ కింద ఉండేవి, కానీ ప్రస్తుత పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద వీటికి ప్రోత్సాహకాలు లేవని ఆయన పేర్కొన్నారు. ఒక కమర్షియల్ వాహనం సాధారణ ప్యాసింజర్ కారుతో పోలిస్తే ఐదు రెట్లు ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది, కాబట్టి ఈ రంగానికి మద్దతు ఇస్తే పర్యావరణ పరిరక్షణ, చమురు దిగుమతుల తగ్గింపు వంటి లాభాలు ఉంటాయని స్పష్టం చేశారు.
వివరాలు
దిగుమతి కార్లపై కస్టమ్స్ డ్యూటీ సవరణ అవసరం
మెర్సిడెస్ బెంజ్ ఇండియా కూడా కేంద్రానికి ముఖ్య సూచనలు చేసింది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సంతోష్ అయ్యర్ మాట్లాడుతూ.."దిగుమతి లగ్జరీ కార్లపై ఉన్న కస్టమ్స్ డ్యూటీ సవరించాలి. అలా అయితే ప్రీమియం సెగ్మెంట్‌లో డిమాండ్ పెరుగుతుంది, అలాగే ప్రభుత్వం పన్నుల రూపంలో ఎక్కువ ఆదాయం పొందగలదు." అని అన్నారు. ప్రస్తుతం, USD 40,000 కంటే తక్కువ ధరల దిగుమతి కార్లపై 70 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ,USD 40,000 పైగా ఉన్న కార్లపై 110 శాతం డ్యూటీ విధించబడుతోంది. స్లాబ్‌లను ఏకరీతిగా మార్చి ఒకే స్లాబ్ కిందకి తీసుకురావాలని సూచించారు. గతేడాది జీఎస్టీ రేట్ల సవరణ సానుకూలం అని, కస్టమ్స్ డ్యూటీ విషయంలో కూడా ఇలాంటి సంస్కరణలు అవసరమని ఆయన చెప్పారు.
వివరాలు
ఆటోమొబైల్ రంగానికి కొత్త ఊపు
అలాగే, రూపాయి విలువ తగ్గకుండా ఉంచే విధానాలు, స్థిరమైన ఆర్థిక నియంత్రణ, మెరుగైన ఫిస్కల్ మేనేజ్‌మెంట్ కూడా అవసరమని పేర్కొన్నారు. ఖర్చులు పెరగడం వల్ల కంపెనీలు ధరలు పెంచాల్సి వస్తుంది, దాంతో డిమాండ్ పై ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది. మొత్తానికి, యూనియన్ బడ్జెట్ 2026లో ఎంట్రీ లెవల్ ఈవీలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, కమర్షియల్ ఈవీలకు మద్దతు ధర, దిగుమతి కార్లపై కస్టమ్స్ డ్యూటీ సవరణ అలాంటి నిర్ణయాలు తీసుకుంటే, ఆటోమొబైల్ రంగానికి కొత్త ఊపు లభిస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.