T Rex Smart Electric Cycle:భారతదేశపు మొట్టమొదటి స్మార్ట్ ఎలక్ట్రిక్ సైకిల్.. రూ.45,999 ధరకు బ్లూటూత్ + GPS మోడల్
ఈ వార్తాకథనం ఏంటి
కాలం మారినా ఆదరణ మసకబారనిది సైకిల్ మాత్రమే. రోజువారీ అవసరాలకు ఉపయోగపడడమే కాకుండా శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు కూడా ఇది ఎంతో ఉపకరిస్తుంది. వైద్యులు సైతం సైక్లింగ్ చేయాలని తరచుగా సూచిస్తుంటారు. గతంలో సాధారణ సైకిళ్లుగా ఉన్న ఇవి టెక్నాలజీ అభివృద్ధితో ఎలక్ట్రిక్ సైకిళ్లుగా మారాయి. ఇప్పుడు మార్కెట్లో ఈ-సైకిళ్లకు విస్తృత ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో తాజాగా దేశంలోనే తొలి స్మార్ట్ ఎలక్ట్రిక్ సైకిల్ అందుబాటులోకి వచ్చింది. బ్లూటూత్, జీపీఎస్ వంటి ఆధునిక ఫీచర్లతో ఇది వినియోగదారులను ఆకట్టుకుంటోంది.
వివరాలు
ఈ సదుపాయాలతో వచ్చిన మొట్టమొదటి ఈ-సైకిల్
దేశీయ ఎలక్ట్రిక్ సైకిళ్ల తయారీ సంస్థ ఇమోటోరాడ్ (EMotorad) బ్లూటూత్‌తో పాటు GPS కనెక్టివిటీ కలిగిన స్మార్ట్ ఈ-సైకిల్‌ను విడుదల చేసింది. ఇది భారతదేశంలో ఈ సదుపాయాలతో వచ్చిన మొట్టమొదటి ఈ-సైకిల్‌గా కంపెనీ తెలిపింది. ఈ మోడల్‌కు 'టి-రెక్స్ స్మార్ట్' అని పేరు పెట్టారు. ఇటీవలి కాలంలో నగరాల్లో ప్రయాణాలకు, స్వల్ప దూరాల ప్రయాణాలకు ఎలక్ట్రిక్ సైకిళ్లు విస్తృతంగా ఉపయోగంలోకి వస్తున్న నేపథ్యంలో ఈ సైకిల్‌ను వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని మార్కెట్‌లోకి తెచ్చారు.
వివరాలు
AMIIGO NXT అనే ప్రత్యేక యాప్
ధరల విషయానికొస్తే, పూణేకు చెందిన EMotorad సంస్థ ఈ-సైకిల్‌ను రెండు వెర్షన్లలో అందిస్తోంది. బ్లూటూత్ ఫీచర్‌తో వచ్చే మోడల్ ధర రూ.37,999 కాగా, బ్లూటూత్‌తో పాటు GPS కనెక్టివిటీ కలిగిన వెర్షన్ ధర రూ.45,999గా నిర్ణయించారు. ఈ సైకిల్ ప్రత్యేకత ఏమిటంటే,సంస్థ రూపొందించిన AMIIGO NXT అనే ప్రత్యేక యాప్‌తో ఇది అనుసంధానమవుతుంది. iOS, Android రెండు ప్లాట్‌ఫార్మ్‌లలో అందుబాటులో ఉన్న ఈ యాప్ ద్వారా రైడర్‌లు తమ ప్రయాణ మార్గాల చరిత్రను చూడడం, రియల్ టైమ్‌లో ట్రిప్‌లను ట్రాక్ చేయడం, పనితీరు వివరాలను విశ్లేషించడం వంటి పనులు చేసుకోవచ్చు. ఇదే కాకుండా, వర్చువల్ రైడింగ్ పరిమితిని నిర్ణయించుకునే జియోఫెన్సింగ్ సదుపాయం, వేగాన్ని నియంత్రించే చైల్డ్ లాక్ ఫీచర్ కూడా ఇందులో ఉన్నాయి.
వివరాలు
29 అంగుళాల పంక్చర్ రక్షణ కలిగిన నైలాన్ టైర్లు
ముఖ్యంగా పిల్లలు సైక్లింగ్ చేస్తున్నప్పుడు తల్లిదండ్రులకు ఇవి ఉపయోగపడనున్నాయి. సైకిల్ దొంగతనం జరగకుండా అలర్ట్ ఇవ్వడానికి థెఫ్ట్ అలారం ఏర్పాటు చేశారు. అదనంగా రిమోట్ ఇమ్మొబిలైజేషన్, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే SOS ఫీచర్, రైడర్ హిస్టరీ వంటి మరిన్ని స్మార్ట్ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. టి-రెక్స్ స్మార్ట్ ఈ-సైకిల్ బలమైన హై టెన్సైల్ స్టీల్ హార్డ్‌టెయిల్ MTB ఫ్రేమ్‌పై తయారు చేశారు. ఇందులో 29 అంగుళాల పంక్చర్ రక్షణ కలిగిన నైలాన్ టైర్లు, 100 ఎంబీ ట్రావెల్‌తో కూడిన ఫ్రంట్ సస్పెన్షన్ అమర్చారు.
వివరాలు
6V 10.2Ah లిథియమ్ అయాన్ రిమూవబుల్ బ్యాటరీ
36V 250W సామర్థ్యమైన రియర్-హబ్ మోటార్ ఈ సైకిల్‌కు ప్రధాన శక్తి కేంద్రంగా పనిచేస్తుంది. దీనికి 36V 10.2Ah లిథియమ్ అయాన్ రిమూవబుల్ బ్యాటరీ అనుసంధానించారు. పెడల్ అసిస్టుతో ఇది గరిష్టంగా 50 కిలోమీటర్ల వరకు, థ్రాటిల్ వాడకంతో సుమారు 40 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఇందులో మెటల్ మడ్ గార్డులు, రియర్ వ్యూ మిర్రర్, మొబైల్ హోల్డర్, క్యారియర్, హార్న్‌తో కూడిన ఫ్రంట్ లైట్, కంపెనీ ప్రత్యేక XCap లాక్‌సేఫ్ సిస్టమ్ వంటి అదనపు సదుపాయాలు ఉన్నాయి. ఈ సైకిల్ 110 కిలోల బరువు వరకు మోయగల సామర్థ్యాన్ని కలిగి ఉండగా, ఫ్రేమ్‌కు ఐదేళ్ల వారంటీని కంపెనీ అందిస్తోంది.