ePluto 7G Max: సరికొత్త ఫీచర్లతో మార్కెట్లోకి ఈప్లూటో 7జీ మ్యాక్స్ స్కూటీ.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 201 కి.మీ
విద్యుత్ వాహన తయారీ సంస్థ ప్యూర్ ఈవీ ఈప్లూటో 7జీ మాక్స్ స్కూటీని లాంచ్ చేసింది. అద్భుత ఫీచర్స్‌తో ఈ వెహికల్ వినియోగదారులను ఆకర్షిస్తోంది. హిల్ స్టార్ట్ అసిస్ట్, డౌన్ హిల్ అసిస్ట్, కోస్టింగ్ రీజెన్, రివర్స్ మోడ్ వంటి ఫీచర్లతో ఈ వాహనాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ స్కూటీ మ్యాట్ బ్లాక్, రెడ్, గ్రే, తెలుపు రంగుల్లో అందుబాటులో ఉండనుంది. ఈ వెహికల్ ధర రూ. 1.14 లక్షలు ఉంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 201 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. ఇందులో స్మార్ట్ బీఎంఎస్ తో కూడిన AIS-156 సర్టిఫైడ్ 3.5kWh హెవీ-డ్యూటీ బ్యాటరీని అమర్చారు.
ఈప్లూటో 7జీ మ్యాక్స్ లో అద్భుత ఫీచర్లు
బ్లూటూత్ కనెక్టివిటీ, 2.4 KW గరిష్ఠ శక్తిని ఉత్పత్తి చేసే పవర్ ట్రెయిన్, సీఏఎన్ ఆధారిత ఛార్జర్ వస్తున్నాయి. రానున్న రోజుల్లో వచ్చే ఎలాంటి ఓటీఏ ఫర్మ్‌వేర్ అప్‌డేట్లనైనా తీసుకునేలా స్కూటీని తీర్చిదిద్దినట్లు కంపెనీ తెలిపింది. రోజుకి కనీసం 100 కిలోమీటర్లు ప్రయాణించే కస్టమర్లను దృష్టిలో ఉంచుకొని దీన్ని మార్కెట్‌లోకి తీసుకొస్తున్నట్లు ప్యూర్ ఈవీ సహ- వ్యవస్థాపకుడు, సీఈఓ రోహిత్ వడెరా తెలిపారు. బ్యాటరీ స్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించే ఏఐ ఆధారిత పవర్ డిశ్చార్జ్ వంటి అధునాతన ఫీచర్ ను జోడించడం వల్ల బ్యాటరీ లైఫ్ సైకిల్ 50 శాతం పెరుగుతుందని రోహిత్ పేర్కొన్నారు. బండి ఒకవైపు వంగిన సమయంలో కింద పడకుండా నియంత్రించేలా స్మార్ట్ సెన్సర్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేశామన్నారు.