
FASTag annual pass: ఆగస్ట్ 15 నుండి ఫాస్టాగ్ వార్షిక పాస్ ప్రారంభం.. తరచూ హైవే ప్రయాణించే వాళ్లకు భారీ ఊరట!
ఈ వార్తాకథనం ఏంటి
తరచూ జాతీయ రహదారులపై ప్రయాణించే ప్రయాణికులకు ఒక శుభవార్త. ఫాస్టాగ్ వార్షిక పాస్ (FASTag Annual Pass) ఈ నెల నుంచే అందుబాటులోకి రాబోతోంది. ఆగస్ట్ 15 నుంచి ప్రైవేట్ వాహనదారులు ఈ కొత్త పాస్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ పాస్‌తో ఏడాది పాటు టోల్ ఫ్లాజాల దగ్గర ఆగాల్సిన అవసరం లేకుండా 200 టోల్ ఫ్రీ ట్రిప్స్ వరకూ ప్రయాణించవచ్చు. ఈ పాస్ మొదటగా కేంద్ర రోడ్లు, రవాణా, హైవేల మంత్రిత్వశాఖ (MoRTH) ప్రకటించింది. తరచూ ప్రయాణించే వాళ్లు ప్రతి టోల్ గేట్ దగ్గర డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఒకే సారి ఫీజు చెల్లించి, సమయం, డబ్బు రెండూ మిగిల్చుకునేలా ఈ పాస్ రూపొందించారు.
వివరాలు
వార్షిక ఫీజు ₹3,000గా నిర్ణయం
ఈ పాస్‌ను యాక్టివేట్ చేసుకోవాలంటే 'రాజ్‌మార్గ్ యాత్ర' మొబైల్ యాప్ లేదా NHAI వెబ్‌సైట్ ద్వారా అప్లై చేయాలి. అక్కడ వాహనం వివరాలు VAHAN డేటాబేస్ ద్వారా చెక్ చేస్తారు. ఈ పాస్ ప్రైవేట్ కార్లు,జీపులు,వాన్‌లకు మాత్రమే వర్తిస్తుంది.వాణిజ్య వాహనాలు దీనిని వాడలేవు. ఎవరైనా తప్పుగా వాడితే పాస్ డీ యాక్టివేట్ అయిపోతుంది.వాహన వివరాల వాలిడేషన్ పూర్తయిన తర్వాత,ఆన్‌లైన్‌లో పేమెంట్ చేయాలి. సుమారుగా రెండు గంటలలోపే యాక్టివేషన్ పూర్తవుతుంది.యాక్టివ్ అయిన తర్వాత,ఇది జాతీయ రహదారులు (NH),నేషనల్ ఎక్స్‌ప్రెస్‌వేలు (NE) పై ఉన్న అన్ని NHAI టోల్ ఫ్లాజాలపై వర్తిస్తుంది. అయితే, రాష్ట్ర రహదారులు, లోకల్ రోడ్లు లేదా పార్కింగ్ ప్లేస్‌లలో ఫాస్టాగ్ మామూలుగానే పని చేస్తుంది. అక్కడ ఫీజు చెల్లించాల్సిందే.
వివరాలు
ఒక ట్రిప్‌గా క్లోజ్డ్ టోల్ సిస్టమ్‌లో ఎంట్రీ-ఎగ్జిట్
ఒక్కోసారి టోల్ ఫ్లాజాను దాటితే ఒక ట్రిప్‌గా లెక్కిస్తారు. క్లోజ్డ్ టోల్ సిస్టమ్‌లో ఎంట్రీ-ఎగ్జిట్ కాంబినేషన్‌ను ఒక ట్రిప్‌గా తీసుకుంటారు. ఒకసారి 200 ట్రిప్స్ పూర్తి అయితే లేదా ఏడాది గడిచిపోతే, ఈ పాస్ ఆటోమాటిక్‌గా మామూలు ఫాస్టాగ్‌గా మారిపోతుంది. మళ్లీ అదే ప్రయోజనం పొందాలంటే, తదుపరి సంవత్సరం కోసం తిరిగి యాక్టివేట్ చేసుకోవాలి. ఈ కొత్త వ్యవస్థతో, తరచూ ప్రయాణించే వాళ్లకు టోల్ గేట్‌ల వద్ద ఎటువంటి ఆలస్యం లేకుండా సౌకర్యంగా ప్రయాణించేందుకు సులభవవుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ముఖ్యంగా దగ్గర దూరాల్లోని టోల్ గేట్ల సమస్యకి ఇది పరిష్కారమవుతుందని ఆయన అన్నారు.