Mercedes-Benz: రూ.23 కోట్ల ఫెరారీని ఢీకొట్టిన బెంజ్ కారు.. అమెరికాలో భారీ ప్రమాదం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో అరుదైన ఫెరారీ సూపర్‌కార్‌కు సంబంధించిన రోడ్డు ప్రమాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సుమారు రూ.23 కోట్ల విలువైన ఫెరారీ 812 కంపెటిజియోన్ అపెర్టా కారు, మెర్సిడెస్-బెంజ్ ఈ-క్లాస్ కాబ్రియోలెట్ కారును ఢీకొట్టింది. ఈ ఘటన అమెరికాలోని మాలిబూ ప్రాంతంలోని పసిఫిక్ కోస్ట్ హైవేపై చోటు చేసుకుంది. ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.
వివరాలు
ప్రపంచ వ్యాప్తంగా 599 కార్లు..
సిల్వర్-యెల్లో కలర్‌లో ఉన్న ఈ ఓపెన్‌టాప్ ఫెరారీ ప్రపంచవ్యాప్తంగా కేవలం 599 యూనిట్లు మాత్రమే తయారయ్యాయి. ప్రమాదానికి ముందు ఈ కారు సముద్ర తీర రహదారిపై వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఘటన తర్వాత బయటకు వచ్చిన దృశ్యాల ప్రకారం, ఫెరారీ కార్ వెనుక నుంచి మెర్సిడెస్-బెంజ్ కన్వర్టిబుల్ కారును ఢీకొట్టినట్లు అధికారులు భావిస్తున్నారు. ఢీకొట్టిన ప్రభావంతో బెంజ్ కారు వెనుక భాగం ఫెరారీ ముందు భాగంపైకి ఎగిరి పడినట్లు కనిపించింది.
వివరాలు
ఫెరారీతో పోలిస్తే బెంజ్ ఖర్చులు తక్కువ..
ఈ ప్రమాదంలో ఫెరారీ కారుకు భారీ నష్టం వాటిల్లింది. ఢీకొట్టిన దెబ్బకు కారు బానెట్ పైకి లేచిపోయింది. ఖరీదైన కార్బన్-ఫైబర్ ఫ్రంట్ బంపర్ పూర్తిగా ధ్వంసమైంది. అలాగే ఇంజిన్ భాగాలకు కూడా నష్టం జరిగి ఉండొచ్చని సమాచారం. కారు ముందు అద్దం పూర్తిగా పగిలిపోయింది. ప్యాసింజర్ వైపు ఫ్రంట్ ప్యానెల్ కూడా తీవ్రంగా దెబ్బతింది. ఫెరారీతో పోలిస్తే బెంజ్ మరమ్మతుల ఖర్చు చాలా తక్కువగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రమాదానికి అసలు కారణం ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. అయితే వాహనాల పరిస్థితిని పరిశీలించిన అధికారులు, ఫెరారీ డ్రైవర్ ముందున్న మెర్సిడెస్ కారును వెనుక నుంచి ఢీకొట్టినట్లు భావిస్తున్నారు.
వివరాలు
మార్కెట్లో భారీగా డిమాండ్..
ఫెరారీ 812 కంపెటిజియోన్ అపెర్టా మోడల్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇందులో 6.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ V12 ఇంజిన్ అమర్చారు. ఈ ఇంజిన్ 9,250 rpm వద్ద 819 హార్స్‌పవర్ శక్తిని, 7,000 rpm వద్ద 691 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మార్కెట్లోకి వచ్చినప్పుడు ఈ కారు ధర తక్కువగానే ఉన్నప్పటికీ, అరుదైన మోడల్ కావడం, కలెక్టర్లలో భారీ డిమాండ్ ఉండటంతో ప్రస్తుతం దీని విలువ 2.5 మిలియన్ డాలర్లకు పైగా చేరింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని సమాచారం. అయితే ఖరీదైన ఫెరారీ కారుకు జరిగిన భారీ నష్టం కారణంగా ప్రపంచవ్యాప్తంగా సూపర్‌కార్ అభిమానుల దృష్టి ఈ ఘటనపై పడింది.