Ford: 2 సంవత్సరాల తర్వాత చెన్నైలో ఫోర్డ్ ఇండియా ప్లాంట్ రీ ఓపెన్..!
అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ ఇండియాకి తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఫోర్డ్ మోటార్స్, భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉన్న తన తయారీ ప్లాంట్‌ను ఎగుమతుల కోసం మళ్ళీ ప్రారంభించాలనే ఆలోచనలో ఉంది. మూడు సంవత్సరాల క్రితం, భారత మార్కెట్లో ఇతర కార్ల తయారీ సంస్థలతో పోటీని తట్టుకోలేక ఇండియాలో తన కార్యకలాపాలను నిలిపివేసింది. ఇప్పుడు, భారతీయ మార్కెట్లోకి తిరిగి రావడానికి అవకాశం ఉందని, ఫోర్డ్ తాజాగా ప్రకటించింది. ఎగుమతుల కోసం తమిళనాడులోని ప్లాంట్‌ను మళ్ళీ ప్రారంభించేందుకు చర్చలు జరుగుతున్నాయని, ఈ మేరకు ఫోర్డ్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖను సమర్పించిందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వెల్లడించారు.
2022లో ఆగిపోయిన ఎగుమతుల ప్రక్రియ
2021లో, భారతదేశంలో ఫోర్డ్ తన కార్ల ఉత్పత్తిని నిలిపివేసి, విక్రయాలను కూడా నిలిపివేసింది. 2022లో ఎగుమతుల ప్రక్రియను కూడా ఆపివేసింది, ముఖ్యంగా ఆసియాలో ఇతర ప్రముఖ కార్ల తయారీ సంస్థల గట్టి పోటీ కారణంగా. భారత్, ప్రపంచంలో మూడో అతిపెద్ద కార్ మార్కెట్‌గా ఉన్నప్పటికీ, ఫోర్డ్ ఈ పోటీని తట్టుకోలేక నిష్క్రమించింది. అయితే తాజాగా, గ్లోబల్ మార్కెట్ కోసం ఎగుమతులను నిర్వహించేందుకు తమిళనాడులోని ప్లాంట్‌ని మళ్ళీ ప్రారంభించాలని నిర్ణయించుకుంది. చెన్నైలోని ఈ ప్లాంట్‌లో ఫోర్డ్ ఎలాంటి కార్లను తయారు చేయనుందో తదుపరి ప్రకటిస్తామని కంపెనీ వెల్లడించింది. గతంలో, చెన్నై ప్లాంట్‌లో ఫోర్డ్ కార్లు, ఇంజన్లను ఉత్పత్తి చేసింది.